తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Gyanvapi Case : జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేకు కోర్టు గ్రీన్​సిగ్నల్​ - జ్ఞానవాపి మసీదు శాస్త్రీయ సర్వే

Gyanvapi Case Allahabad High Court : వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వే చేయడానికి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు అలహాబాద్ హైకోర్టు గ్రీన్​సిగ్నల్ ఇచ్చింది. న్యాయ ప్రయోజనాల కోసం శాస్త్రీయ సర్వే చేపట్టడం అవసరమని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. ఈ తీర్పును యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య స్వాగతించారు.

gyanvapi case allahabad high court
gyanvapi case allahabad high court

By

Published : Aug 3, 2023, 10:14 AM IST

Updated : Aug 3, 2023, 8:11 PM IST

Gyanvapi Case Allahabad High Court : వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వే చేయడానికి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు అలహాబాద్ హైకోర్టు అనుమతినిచ్చింది. ఆలయ పునాదులపై జ్ఞానవాపి మసీదును నిర్మించారనే వాదనల్లో నిజానిజాలను నిర్ధరించేందుకు ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను(ఏఎస్‌ఐ) వారణాసి జిల్లా కోర్టుఆదేశించడాన్ని సవాల్‌ చేస్తూ మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. న్యాయ ప్రయోజనాల కోసం శాస్త్రీయ సర్వే చేపట్టడం అవసరమని వ్యాఖ్యానించింది. ఈ మేరకు అలహాబాద్ హైకోర్టు గురువారం తీర్పును వెలువరించింది.
జ్ఞాన్‌వాపి మసీదు సముదాయంలో ఏఎస్‌ఐ సర్వే చేయడానికి అలహాబాద్ హైకోర్టు అనుమతి ఇచ్చిందని హిందూ పిటిషనర్ల తరఫు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ తెలిపారు. వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించిందని అన్నారు.

'హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా'
Gyanvapi Masjid Case Verdict : జ్ఞానవాపి మసీదుసముదాయాన్ని ఏఎస్​ఐ సర్వే చేసేందుకు అలహాబాద్ హైకోర్టు అనుమతి ఇవ్వడంపై ఉత్తర్​ప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్​ ప్రసాద్ మౌర్య స్పందించారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నానని ఆయన తెలిపారు. అలాగే ఏఎస్​ఐ సర్వే తర్వాత నిజం బయటకు వస్తుందని.. జ్ఞానవాపి సమస్య పరిష్కారమవుతుందని తాను విశ్వసిస్తున్నానని అభిప్రాయపడ్డారు.

ఆల్ ఇండియా ముస్లిం లా బోర్డు స్పందన..
జ్ఞానవాపి మసీదు సముదాయంలో శాస్త్రీయ సర్వేకు అలహాబాద్​ హైకోర్టు తీర్పు ఇవ్వడంపై ఆల్​ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యుడు ఖలీద్ రషీద్ ఫరంగి స్పందించారు. 'జ్ఞానవాపి మసీదు దాదాపు 600 ఏళ్ల క్రితం నాటిది. అప్పటి నుంచి ముస్లింలు ఆ మసీదులో నమాజ్ చేస్తున్నారు. వారికి న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించడం కోసం ముస్లిం పక్షం ఆలోచిస్తుంది.' అని తెలిపారు.

కాగా, అలాహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ జ్ఞానవాపి మసీదు కమిటీ.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆర్టికల్ 370 కేసు విచారణ జరుపుతున్న ఐదుగురు సభ్యుల ధర్మాసనం వద్ద న్యాయవాది నిజాం పాషా... ఈ విషయాన్ని ప్రస్తావించారు. అత్యవసర విచారణ కోసం మెయిల్ చేశామని, ASI సర్వే చేయకుండా చూడాలని CJIను కోరారు. మెయిల్‌ను పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని CJI జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. మరోవైపు, తమ వాదనలు వినకుండా జ్ఞానవాపి మసీదు విషయంలో ఆదేశాలు జారీ చేయవద్దని... హిందువుల తరపు న్యాయవాది సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం వాదనలు వింటామని సుప్రీంకోర్టు తెలిపింది.

'కోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉన్నాం'
మరోవైపు.. జ్ఞానవాపి మసీదుపై అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కట్టుబడి ఉంటామని సమాజ్​వాదీ పార్టీ ఎంపీ ఎస్​టీ హసన్ తెలిపారు. 'ప్రస్తుత కాలంలో భారత్​కు మత సామరస్యం, జాతీయ సమైక్యత అవసరం. దేశంలోని ప్రజల మధ్య విభేదాలు సృష్టించే ప్రకటనలు చేయకూడదు' అని పరోక్షంగా ఇటీవల ఉత్తర్​ప్రదేశ్​ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ వేశారు.

సర్వే జరపాలని పిటిషన్​..
Gyanvapi Mosque ASI Survey : మొఘలుల కాలంలో హిందూ ఆలయ స్థానంలో జ్ఞానవాపి మసీదు నిర్మితమైందని, ఈ విషయాన్ని సర్వే నిర్వహించి నిర్ధరించాలని కోరుతూ నలుగురు హిందూ మహిళలు.. వారణాసి జిల్లా​ కోర్టులో ఈ ఏడాది మే 16న పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే చేపట్టాలని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను(ఏఎస్​ఐ) ఆదేశించింది. ఏఎస్​ఐ అధికారుల బృందం జులై 24న సర్వే ప్రారంభించింది. దీన్ని వ్యతిరేకిస్తూ మసీదు కమిటీ సుప్రీంకోర్టుకు వెళ్లింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. సర్వేపై రెండు రోజుల పాటు స్టే విధించింది. వారణాసి కోర్టు తీర్పుపై మసీదు కమిటీ అలహాబాద్‌ హైకోర్టుకు వెళ్లొచ్చని తెలిపింది.

ఈ నేపథ్యంలోనే వారణాసి కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ మసీదు కమిటీ అలహాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. ఏఎస్‌ఐ సర్వేపై స్టే విధించి తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. తాజాగా మసీదు కమిటీ పిటిషన్‌ను కొట్టివేస్తూ గురువారం తీర్పు వెలువరించింది. తక్షణమే సర్వే ప్రారంభించేందుకు ఏఎస్‌ఐకి అనుమతినిచ్చింది.

Last Updated : Aug 3, 2023, 8:11 PM IST

ABOUT THE AUTHOR

...view details