తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జ్ఞానవాపి మసీదులో 'శాస్త్రీయ సర్వే'.. వారణాసి కోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే - జ్ఞాన్​వాపి మసీదు కేసు సుప్రీం కోర్టు

Gyanvapi Case Carbon Dating : ఉత్తర్​ప్రదేశ్​లోని జ్ఞానవాపి మసీదులో జరుగుతున్న శాస్త్రీయ సర్వేకు బ్రేక్‌ పడింది. ఈ సర్వేపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. జులై 26వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొంది.

Gyanvapi Carbon Dating
Gyanvapi Carbon Dating

By

Published : Jul 24, 2023, 12:08 PM IST

Updated : Jul 24, 2023, 12:49 PM IST

Gyanvapi Case Carbon Dating : ఉత్తర్​ప్రదేశ్​లోని ప్రసిద్ధ కాశీవిశ్వనాథ ఆలయానికి సమీపంలో ఉన్న జ్ఞానవాపి మసీదులో సోమవారం ఉదయం ప్రారంభమైన శాస్త్రీయ సర్వేను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. శాస్త్రీయ సర్వేపై వారణాసి కోర్టు ఆదేశాలను జులై 26 సాయంత్రం 5 గంటల వరకు అమలు చేయరాదని ఆదేశాలు జారీ చేసింది.

జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే చేపట్టాలని వారణాసి కోర్టు గతవారం కీలక ఆదేశాలు వెలువరించింది. కోర్టు ఆదేశాల మేరకు భారత పురావస్తు అధికారుల బృందం సోమవారం సర్వే ప్రారంభించింది. దీన్ని వ్యతిరేకిస్తూ మసీదు కమిటీ.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వారణాసి కోర్టు ఆదేశాలపై స్టే విధించాలని కోరింది. ఈ పిటిషన్‌ను పరిగణలోకి తీసుకున్న సీజేఐ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం.. సోమవారం అత్యవసర విచారణ చేపట్టింది.

'ఒక్క ఇటుక కూడా తొలగించట్లేదు'
విచారణ సమయంలో సీజేఐ ధర్మాసనం.. సర్వే చేస్తున్నప్పుడు మసీదు ప్రాంగణంలో పురావస్తు అధికారులు తవ్వకాలు చేపడతారా? అని కేంద్రాన్ని ప్రశ్నించింది. దీనికి కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్ తుషార్‌ మెహతా స్పందించారు. "ఒక్క ఇటుకనూ తొలగించట్లేదు. అలాంటి ప్రణాళిక కూడా లేదు. ప్రస్తుతానికి అక్కడ కొలతలు, ఫొటోగ్రఫీ, రాడార్‌ ప్రక్రియ మాత్రమే కొనసాగుతోంది. ఇది మసీదు నిర్మాణాలపై ఎలాంటి ప్రభావం చూపించదు" అని కోర్టుకు తెలిపారు. మసీదు ప్రాంగణంలో నిర్మాణాల తొలగింపు లేదా తవ్వకాలు చేపట్టట్లేదని సొలిసిటర్ జనరల్​ పేర్కొన్నారు.

సర్వేపై స్టే.. అలహాబాద్‌ హైకోర్టుకు వెళ్లేందుకు అనుమతి
అయితేఇరు పక్షాల వాదనలు విన్న సీజేఐ జస్టిస్​ డీవై చంద్రచూడ్​ ధర్మాసనం.. శాస్త్రీయ సర్వేపై స్టే విధించింది. జులై 26 వరకు మసీదు ప్రాంగణంలో ఎలాంటి శాస్త్రీయ సర్వే చేపట్టరాదని స్పష్టం చేసింది. వారణాసి కోర్టు ఆదేశాలపై మసీదు కమిటీ అలహాబాద్‌ హైకోర్టులో అప్పీలు చేసుకునేందుకు అనుమతినిచ్చింది.

మొఘల్‌ కాలంలో హిందూ ఆలయ స్థానంలో ఈ మసీదు నిర్మితమైందని, ఈ విషయాన్ని సర్వే నిర్వహించి నిర్ధరించాలని కోరుతూ నలుగురు హిందూ మహిళలు.. వారణాసి కోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే చేపట్టాలని భారత పురావస్తు విభాగాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీల్‌ చేసిన వజూఖానా ప్రాంతాన్ని మినహాయించి మసీదు ప్రాంగణమంతా కార్బన్‌ డేటింగ్‌, ఇతర పద్ధతుల ద్వారా శాస్త్రీయ సర్వే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. సర్వే ప్రక్రియకు సంబంధించిన వీడియో క్లిప్‌లు, ఫొటోలతో పాటు ఆగస్టు 4లోగా కోర్టుకు నివేదిక సమర్పించాలని వారణాసి జడ్జి ఏకే విశ్వేశ్ ఏఎస్​ఐని ఆదేశించారు.

Last Updated : Jul 24, 2023, 12:49 PM IST

ABOUT THE AUTHOR

...view details