Madhyapradesh Road Accident: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు ఎక్కేందుకు వేచి చూస్తున్న ఓ కుటుంబంపైకి అత్యంత వేగంగా ప్రయాణిస్తున్న కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఇందులో నలుగురు ఒకే కుటుంబానికి చెందినవారు. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి కారు డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.
పోలీసులు సమాచారం ప్రకారం..జిల్లా కేంద్రానికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న బరాగావ్ ఖురాయ్ గ్రామంలో జరిగిన వివాహ కార్యక్రమానికి ఓ కుటుంబం హాజరైంది. కార్యక్రమం పూర్తయ్యాక బస్సు కోసం రోడ్డుపై వేచి ఉన్నారు. అదే సమయంలో అత్యంత వేగంగా నడుపుతూ రోడ్డుపై వేచి ఉన్న వారిపైకి కారుతో దూసుకెళ్లాడు ఓ డ్రైవర్. ఆ తర్వాత కారు వదిలి పరారయ్యాడు. గుర్తు తెలియని డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతులను పప్పు జఠవ్ (50), అతడి భార్య రాజా బేటీ (35), వారి కుమార్తెలు రేష్మ (10), పూనమ్‌గా (5) గుర్తించారు. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు తెలిపారు.
ఫోన్ కోసం తమ్ముడ్ని చంపిన అన్న..గుజరాత్ అహ్మదాబాద్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. ఆన్‌లైన్ గేమ్ ఆడేందుకు మొబైల్ ఫోన్ ఇవ్వలేదని సొంత తమ్ముడిని రాయితో కొట్టి చంపాడు ఓ అన్న. ఆ తర్వాత బాధితుడి మృతదేహాన్ని బావిలో పడేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.