సినిమా చూసేందుకు థియేటర్‌కు వెళ్లి ఎలుక కాటుకు గురైన ఓ మహిళకు రూ.60 వేలు పరిహరం చెల్లించాలని జిల్లా వినియోగదారుల కమిషన్.. థియేటర్ యాజమాన్యానికి ఆదేశించింది. మెడికల్ బిల్లు 2 వేల రూపాయలతో పాటు కోర్టు ఖర్చులకు అదనంగా రూ.5 వేలు పేర్కొంది. అసోంలోని గువాహటి జిల్లాలో ఈ ఘటన జరిగింది.
బాధిత మహిళ లాయర్ కథనం ప్రకారం....
2018 అక్టోబర్ 20న అనిత అనే మహిళ.. జిల్లాలోని భాంగాఘర్ ప్రాంతంలో ఉన్న గలెేరియా థియేటర్లో సినిమా చూసేందుకు తన కుటుంబసభ్యులతో కలిసి వెళ్లింది. సినిమా ఇంటర్వెల్ సమయంలో తన కాలిని ఓ ఎలుక కొరికింది. వెంటనే ఆమె సినిమా హాలు నుంచి బయటకు పరిగెత్తింది. రక్తస్రావం అవుతున్న అనితకు సినిమా హాలు నిర్వాహకులు ఎలాంటి ప్రథమ చికిత్స అందించకపోగా.. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లటంలోనూ నిర్లక్ష్యం చేశారని లాయర్ ఆరోపించారు.
"అనితను మొదటగా ఏమి కరించిందోనని తెలియని వైద్యులు.. ఆమెను రెండు గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచారు. తరువాత ఆమె కాలును ఎలుక కొరికిందని నిర్థారణకు వచ్చిన డాక్టర్లు చికిత్స ప్రారంభించారు" అని లాయర్ వర్మ తెలిపారు. థియేటర్ యాజమాన్యం పట్ల అసహనం వ్యక్త పరిచిన అనిత జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించింది. తనకు జరిగిన నష్టం, మానసిక వేదనుకుగాను రూ.6 లక్షల పరిహారం ఇవ్వాలని కోరింది.