Gurpatwant Singh Pannun Video : ఎయిర్‌ఇండియా విమానంలో నవంబర్ 19న ప్రయాణించే వారికి ప్రమాదం పొంచి ఉందంటూ ఖలిస్థాన్ ఉగ్రవాది గుర్‌పత్వంత్ సింగ్ పన్నూ వార్నింగ్ ఇచ్చాడు. భారత్‌లోని సిక్కు ప్రజలెవరూ ఆ రోజున ఎయిర్‌ఇండియా విమానాల్లో ప్రయాణించొద్దని పన్నూ ఓ వీడియోను విడుదల చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఆ రోజు మూతపడుతుందని.. దాని పేరు కూడా మార్చేస్తామని వీడియోలో వార్నింగ్ ఇచ్చాడు. అదే రోజున వన్డే ప్రపంచ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ కూడా జరగబోతున్న విషయాన్ని పన్నూ ప్రస్తావించాడు.
అంతకుముందు అక్టోబర్ 10న కూడా మరో వీడియోను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశాడు. ఇజ్రాయెల్- పాలస్తీనా పరిస్థితులను చూసి ప్రధాని నరేంద్ర మోదీ పాఠాలు నేర్చుకోవాలని.. లేదంటే భారత్‌లోనూ అదే తరహా పరిణామాలు ఎదురవుతాయంటూ పన్నూ హెచ్చరించాడు. పాలస్తీనాలోనే కాదు.. ఇక్కడ కూడా హింస మరో స్థాయిలో ఉంటుందంటూ ఓ వీడియోను విడుదల చేశాడు.
NIA On Khalistan : సిఖ్ ఫర్ జస్టిస్ అనే వేర్పాటువాద సంస్థను 2007లో స్థాపించగా.. వ్యవస్థాపకుల్లో గురుపత్వంత్ సింగ్ పన్ను కూడా ఒకడు. పంజాబ్‌తోపాటు దేశ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడమే కాకుండా ఉగ్ర కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తున్న పన్నూను.. NIA 2019లో మోస్ట్ వాంటెడ్‌గా ప్రకటించింది. ప్రత్యేక ఖలిస్థాన్ కోసం పోరాడటం, ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొనేలా యువతను ప్రేరేపిస్తున్నట్లు NIA దర్యాప్తులో తేలింది. దీంతో అదే ఏడాది సిఖ్స్ ఫర్ జస్టిస్ అనే వేర్పాటువాద సంస్థను NIA నిషేధించింది. . తర్వాత 2022లో పన్నూను కేంద్ర హోంశాఖ ఉగ్రవాదిగా ప్రకటించింది. గురుపత్వంత్ సింగ్ పన్నూకు పంజాబ్‌లో ఉన్న ఆస్తులను జప్తు చేసింది ఎన్ఐఏ. అయితే అతడిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని భారత ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని ఇంటర్‌పోల్ రెండుసార్లు తిరస్కరించింది. తాజాగా కెనడా-భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ కెనడాలోని హిందువులపై మరోసారి బెదిరింపులకు పాల్పడ్డాడు.
NIA On Gurpatwant Singh : 'భారత్‌ను విభజించేందుకు ఉగ్ర కుట్రలు'.. NIA దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..
Gurpatwant Singh Pannun Property : కెనడా హిందువులకు గుర్‌పత్వంత్ వార్నింగ్.. ఆస్తులు జప్తు చేసి కేంద్రం షాక్..