Gurpatwant Singh Pannun Property :హిందూ కెనెడియన్లు కెనడా నుంచి వెళ్లిపోవాలని విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్ చీఫ్, ఉగ్రవాది గుర్‌పత్‌వంత్ సింగ్ పన్నూపై కేంద్రం చర్యలు తీసుకుంది. చండీగఢ్‌లోని పన్నూ ఇంటిని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ సీజ్ చేసింది. అమృత్‌సర్‌లోని పన్నూ పూర్వీకులకు చెందిన పొలాన్ని, చండీగఢ్‌లోని సెక్టార్ 15లో ఉన్న మరో ఇంటిని జప్తు చేసింది. 2020లోనే వీటిని ఎన్ఐఏ అటాచ్ చేయగా.. ఇప్పుడు శాశ్వతంగా జప్తు చేసినట్లు తెలిపింది. పంజాబ్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉగ్రవాద చర్యలు, కార్యకలాపాలను ప్రోత్సహించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న గురుపత్వంత్‌పై 2019లో ఎన్ఐఏ మొదటి కేసు నమోదు చేసింది. అప్పటి నుంచి అతడిపై ఎన్ఐఏ ఓ కన్నేసి ఉంచింది.
2020 జులైలో గుర్‌పత్‌వంత్ సింగ్ పన్నూను ఉగ్రవాదిగా భారత్ ప్రకటించింది. అతడిపై 3 దేశద్రోహ కేసులతోపాటు 22 క్రిమినల్ కేసులు ఉన్నాయి. 2021 ఫిబ్రవరి 3న పన్నూపై ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అనతంరం అదే ఏడాది నవంబర్ 29న అతడిని 'ప్రొక్లేయిమ్డ్ నేరస్థుడు'గా ప్రకటించింది. పన్నూ స్థాపించిన సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్థ.. ఇంటర్నెట్ ద్వారా యువతను మోసం చేసి.. ఉగ్రవాద ఘటనలు, నేరాలకు పాల్పడేలా ప్రేరేపిస్తోందని ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడైంది.