Gurpatwant Singh Pannun Parliament Attack Video :పార్లమెంట్ భవనంపై దాడి చేస్తానని బెదిరించాడు ఖలీస్థానీఉగ్రవాది, నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్(SFJ) నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ. 2001లో పార్లమెంట్‌పై దాడి చేసిన రోజైన డిసెంబర్ 13న లేదా అంతకన్నాముందే ఈ దాడికి పాల్పడుతానంటూ వీడియోను విడుదల చేశాడు. గురుపత్వంత్ సింగ్ పన్నూను హత్య చేయడానికి కుట్రలు జరిగినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలోనే ఈ వీడియో రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ వీడియోలో 2001 పార్లమెంట్ దాడికి సూత్రధారి అయిన అఫ్జల్ గురు ఫొటోతో పాటు దిల్లీ బనేగా ఖలిస్థానీ (దిల్లీని ఖలిస్థానీగా మారుస్తాం) అనే నినాదం ఉన్న పోస్టర్‌ను పట్టుకున్నాడు పన్నూ. తనను హత్య చేయడానికి భారత సంస్థలు చేసిన కుట్రలు విఫలమయ్యాయని అందులో పేర్కొన్నాడు. తనపై కుట్రలకు సమాధానంగా డిసెంబర్ 13కు ముందు పార్లమెంట్‌పై దాడి చేస్తానని తెలిపారు. పన్నూ బెదిరింపు వీడియో బయటకు రావడం వల్ల కేంద్ర నిఘా సంస్థలు అప్రమత్తమయ్యాయి.
2001 డిసెంబర్ 13న పార్లమెంట్‌పై దాడి జరగ్గా, ఈ ఏడాదితో 22 ఏళ్లు పూర్తి కానున్నాయి. మరోవైపు, ప్రస్తుతం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న క్రమంలో ఈ బెదిరింపులకు పాల్పడ్డాడు పన్నూ. సోమవారం ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 22 వరకు జరగనున్నాయి.