gupkar alliance leaders arrest: పునర్విభజన కమిషన్ సిఫారసులకు వ్యతిరేకంగా గుప్కార్ నేతలు ఆందోళనలను దృష్టిలో ఉంచుకొని జమ్ముకశ్మీర్ పోలీసులు ముందస్తు అరెస్ట్లు చేశారు. నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, ఎంపీ ఫరూక్ అబ్దుల్లా, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, సీపీఎం నేత ఎంవై తరిగామిలతో పాటు ఇతర నేతలందరినీ గృహ నిర్బంధంలో ఉంచారు. అయితే తమ శాంతియుత నిరసనలను అణచివేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా విమర్శించారు.
"అందరికీ శుభోదయం, 2022 కి స్వాగతం. కొత్త ఏడాదిలో జమ్ముకశ్మీర్ పోలీసులు ప్రజలను అక్రమంగా ఇళ్లలో బంధిస్తున్నారు. సాధారణ ప్రజాస్వామ్య కార్యకలాపాలకు భంగం కలిగేలా ప్రవర్తిస్తున్నారు. మా నిరసనలను అడ్డుకునేందుకు ఇంటి బయట ఉండే గేట్ ముందు పెద్ద ట్రక్కులు ఆపారు. ఎన్ని జరిగినా కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు. ఇక్కడ చట్టం లేదు. పోలీసుల రాజ్యం మాత్రమే ఉంది. మా నాన్నను ఇంట్లోనే నిర్భందించారు. కనీసం మా సోదరి ఇంటికి వెళ్లేందుకు అవకాశం కూడా లేకుండా తాళాలు వేశారు. ప్రపంచంలోనే అది పెద్ద ప్రజాస్వామ్యానికి ఈ ఘటన ఓ గొడ్డలి పెట్టులాంటిది."