Guntur Mayor With Lathi: ఆందోళనలు.. నిరసన దీక్షలు, ఆగ్రహ జ్వాలలు.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుతో.. రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితి ఇది. చంద్రబాబు అరెస్టు అక్రమమంటూ.. తెలుగుదేశం సహా వివిధ పార్టీ నేతలు, ప్రజా సంఘాలు భగ్గుమన్నాయి. చంద్రబాబు రిమాండ్‌కు నిరసనగా.. రోడ్డెక్కుతున్న నాయకులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. గుంటూరు అరండల్‌పేటలో జనసేన, ఎమ్మార్పీఎస్ నేతలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో వైసీపీ కవ్వింపు చర్యలకు పాల్పడింది. నిరనసకారులను వైసీపీ నేతలు అడ్డుకునేందుకు యత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
Janasena MRPS Protest in Guntur: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ.. పార్టీలకు అతీతంగా నేతలు రోడ్డెక్కుతున్నారు. గుంటూరు అరండల్‌పేటలో జనసేన, ఎమ్మార్పీఎస్ నాయకులు నిరసనలకు దిగారు. రోడ్డుపైకి వచ్చి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Guntur Mayor Manohar Naidu with Lathi:ఈ క్రమంలో అధికార పార్టీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. గుంటూరు మేయర్ మనోహర్ నాయుడు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు అక్కడకు చేరుకున్నారు. ఓ వైపు జనసేన నాయకులు.. మరోవైపు వైసీపీ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలతో హోరోత్తించారు. మేయర్ మనోహర్ నాయుడు లాఠీ పట్టుకుని అటూ ఇటూ తిరుగుతూ ఆందోళనకారులను తరిమికొట్టేందుకు యత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది.
Protest Against Chandrababu Naidu Arrest: జనసేన, వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు రంగప్రవేశం చేసి.. జనసేన, ఎంఆర్‌పీఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనను అడ్డుకోవడంపై జనసేన శ్రేణులు ఖాకీలను నిలదీశారు. శాంతియుతంగా నిరసన తెలిపితే అడ్డుకోవడమేంటని మండిపడ్డారు. వైసీపీ శ్రేణులకు వర్తించని.. 144 సెక్షన్ తమకే ఎందుకని పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.