దివ్యాంగ రెజ్లర్ వీరేందర్ సింగ్.. పద్మశ్రీ అవార్డు అందుకున్న 24 గంటల్లోనే హరియాణా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. తనలాగే వినికిడి సమస్యతో బాధపడుతున్న ఎంతోమంది క్రీడాకారులను పారా అథ్లెట్లుగా గుర్తించాలని దిల్లీలోని హరియాణా భవన్ బయట కూర్చుని నిరసన తెలిపారు. పారా అథ్లెట్లకు వర్తించే అన్ని సదుపాయాలను వినికిడి సమస్య ఉన్న క్రీడాకారులకు వర్తింపజేయాలని.. అప్పటివరకు తాను ఇంటికి వెళ్లనన్నారు. ఈ మేరకు హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌ను డిమాండ్ చేశారు.
జజ్జర్ జిల్లా ససరౌళీ గ్రామానికి చెందిన వీరేందర్ సింగ్.. రెజ్లింగ్‌లో అనేక పతకాలను సాధించారు. ఇప్పటికే ఆయనకు అర్జున అవార్డు దక్కింది. రాష్ట్రపతి చేతుల మీదుగా మంగళవారం పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు వీరేందర్.