Guna Bus Accident :మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13మంది సజీవ దహనమయ్యారు. మరో 13మందికి తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. ఎదురుగా వస్తున్న డంపర్ ట్రక్కు ఢీకొనడం వల్ల ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను గుణ జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. గుణ-ఆరోన్ రహదారిపై రాత్రి 9 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక దళాలు మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.
Madhya Pradesh Bus Accident : మృతుల వివరాలను ధ్రువీకరించిన జిల్లా ఎస్పీ విజయ్ కుమార్ ఖత్రి, ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారని వెల్లడించారు. అందులో నుంచి నలుగురు ప్రయాణికులు ఎలాగోలా బయటపడ్డారని తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని గుణ జిల్లా కలెక్టర్ తరుణ్ రాఠీ తెలిపారు.
ముఖ్యమంత్రి విచారం
ఈ దుర్ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల పరిహారం ప్రకటించారు. దీంతోపాటు ఈ దుర్ఘటనపై విచారణకు ఆదేశించారు. మరోవైపు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా ఈ ప్రమాదంపై స్పందించారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ ఘటన బాధకరమైనదిగా పేర్కొన్న సింధియా, దీని గురించి సమాచారం అందుకున్న వెంటనే కలెక్టర్, ఎస్పీతో మాట్లాడినట్లు తెలిపారు. సహాయక చర్యలు ప్రారంభించాలని ఆదేశించినట్లు వెల్లడించారు.