గుజరాత్ అహ్మదాబాద్‌లో ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. 23 ఏళ్ల ఆయేషా మక్రానీ.. భర్తతో గొడవల కారణంగా కలత చెంది.. ఇలా నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.
ఏం జరిగిందంటే?
గుజరాత్- అహ్మదాబాద్‌లోని వట్వాకు చెందిన ఆయేషా మక్రానీకి, రాజస్థాన్ వాసి ఆరిఫ్ఖాన్తో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే.. పెళ్లైన కొద్ది రోజులకే కుటుంబ వివాదాలు, వరకట్న వేధింపులు ఆమెను వెంటాడాయి. ఈ విషయమై ఆయేషా తండ్రి.. ఆరిఫ్‌ఖాన్, అతడి తల్లిదండ్రులపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయేషా కొద్దిరోజులుగా తమ తల్లిదండ్రుల వద్దే(అహ్మదాబాద్‌లో) ఉంటోంది. గతంలోనూ ఓసారి ఇలాగే జరగ్గా.. ఇరు కుటుంబాల అంగీకారంతో మళ్లీ కాపురానికి వెళ్లిందామె.
ఆరిఫ్‌ఖాన్, ఆయేషా(ఫైల్) పనికి వెళ్తానని..
ఈ పరిస్థితుల్లో మనస్తాపానికి గురైన ఆయేషా.. ఈ నెల 25న పనికోసం వెళ్తానని ఇంటి నుంచి బయల్దేరింది. అదే రోజు సాయంత్రం 4:30 గంటలకు తాను ఆత్మహత్య చేకుకోబోతున్నానని తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. ఆ పరిస్థితుల్లో వారు ఎంతచెప్పినా వినిపించుకోలేదు. అనంతరం ఓ సెల్ఫీ వీడియో తీసి.. తండ్రి, భర్త(ఆరిఫ్)కు పంపింది. అయితే.. 'సరే.. చావు, ఆ తర్వాత వీడియో పంపు' అని భర్త రిప్లై ఇచ్చాడట. ఆ వెంటనే ఆమె సబర్మతి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది.
వీడియో చూసిన ఆయేషా కుటుంబ సభ్యులు.. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని నదిలో నుంచి ఆయేషా మృతదేహాన్ని బయటకు తీశారు. తండ్రి ఫిర్యాదుతో ఆమె భర్త ఆరిఫ్పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
ఇదీ చదవండి:పోలీసుల కస్టడీలోని నిందితుడు ఆత్మహత్య