స్నేహితులతో కలిసి అహ్మదాబాద్‌లోని ఆశారాం బాపు ఆశ్రమ(asharamji bapu ashram ahmedabad) సందర్శనకు వెళ్లి అదృశ్యమైన హైదరాబాద్ యువకుడి కేసు కొత్త మలుపు తిరిగింది. నవంబర్ 11న కనిపించకుండా పోయిన విజయ్ యాదవ్.. బుధవారం(నవంబర్ 17) ఓ వీడియోను విడుదల చేశారు. అయితే.. విజయ్ ఎక్కడ ఉన్నాడనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
వీడియోలో.. తాను నవంబర్ 10న షిబిర్ సందర్శన పూర్తి చేసుకుని వైష్ణోదేవిని(vaishno devi mandir) దర్శించుకునేందుకు జమ్ముకశ్మీర్ వెళ్లినట్లు చెప్పారు విజయ్. జమ్మూ సరిహద్దు దాటగానే.. నెట్వర్క్ సిగ్నల్ అందక మొబైల్ పనిచేయలేదన్నారు. ఆశారాం ఆశ్రమంపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని, తన సొంత నిర్ణయంతోనే జమ్మూ వచ్చినట్లు తెలిపారు. త్వరలోనే తిరిగి వస్తానని చెప్పారు విజయ్.
ఈమెయిల్ ద్వారా..
అంతకుముందు.. విజయ్ తమకు గత మంగళవారం(నవంబర్16) ఈమెయిల్ పంపారని ఆశ్రమ(asharamji bapu ashram ahmedabad) అధికారులు పోలీసులకు తెలిపారు. తాను క్షేమంగానే ఉన్నానని, కొద్ది రోజుల్లోనే తిరిగి వస్తానని చెప్పిట్లు పేర్కొన్నారు. విజయ్ ఐడీ నుంచే మెయిల్ వచ్చిందని తెలిపారు. ' తాను స్వచ్ఛందంగానే వెళ్లానని, త్వరలోనే తిరిగి వస్తానని ఈమెయిల్లో విజయ్ పేర్కొన్నారు. ఈమెయిల్ పంపేందుకు ఉపయోగించిన కంప్యూటర్ ఐపీ అడ్రస్‌తో విజయ్ ఉన్న ప్రాంతాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాం. అతని ఫోన్ నంబర్ కాల్ రికార్డులు సేకరిస్తున్నాం. ' అని పోలీసులు వెల్లడించారు.