కరోనా వల్ల.. ఆస్పత్రులు, వైద్య మౌలిక సదుపాయాల ప్రాధాన్యత తెలిసివచ్చింది. అత్యవసర సమయాల్లో మెరుగైన వైద్య సేవల ఆవశ్యకతను మహమ్మారి చాటి చెప్పింది. కరోనా రెండో దశ ప్రబలినప్పుడు.. దేశంలో పడకల కొరత ప్రజలను తీవ్రంగా వేధించింది. ఆస్పత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోయిన సమయంలో.. అంబులెన్సులతో పాటు ఆటోలు, ప్రైవేటు వాహనాలలోనూ రోగులకు చికిత్స అందించాల్సిన పరిస్థితులు తలెత్తాయి.
థర్డ్ వేవ్‌ను దృష్టిలో ఉంచుకొని గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో పోర్టబుల్ ఆస్పత్రులను (Portable Hospital Unit) నిర్మించారు. ఇండో అమెరికన్ ఫౌండేషన్ సహకారంతో రాజ్‌కోట్ యంత్రాంగం ఈ ఆస్పత్రుల నిర్మాణం చేపట్టింది. మరికొద్దిరోజుల్లో ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న ఈ ఆస్పత్రుల్లో.. పూర్తి స్థాయి వసతులను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న తొలి పోర్టబుల్ ఆస్పత్రులు ఇవే కావడం విశేషం.
ఆస్పత్రుల నిర్మాణానికి కావాల్సిన స్థలం, విద్యుత్ సదుపాయాలను జిల్లా (Rajkot Gujarat India) యంత్రాంగం ఏర్పాటు చేసింది. నిర్మాణం మొత్తం ఇండో అమెరికన్ ఫౌండేషన్ చేపట్టింది. పరికరాలను సైతం ఆ సంస్థే సమకూర్చింది. ఆక్సిజన్ పడకలు సైతం ఇక్కడ అందుబాటులోకి రానున్నాయి. ఓ పూర్తి స్థాయి ఆస్పత్రిలో ఎలాంటి సదుపాయాలు ఉంటాయో.. అవన్నీ ఇక్కడ సిద్ధం చేస్తున్నారు.