Gujarat Elections 2022 : గుజరాత్ శాసనసభ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలో పాగా వేసేందుకు అధికార, ప్రతిపక్షాలు చేసిన.. విస్తృత ప్రచారానికి మంగళవారంతో తెరపడింది. గురువారం దక్షిణ గుజరాత్‌లోని.. 19 జిల్లాలు, కచ్-సౌరాష్ట్ర ప్రాంతాల్లోని 89 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమై.. సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. తొలిదశలో 89 స్థానాలకు మొత్తం 788 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో 718 మంది పురుషులు.. 70 మంది మహిళలు తమ అదృష్టాన్ని.. పరీక్షించుకుంటున్నారు.
మొదటి దశ ఎన్నికల్లో 25,434 పోలింగ్ బూత్‌లలో ఓటింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. పట్టణ ప్రాంతాల్లో 9,018, గ్రామీణ ప్రాంతాల్లో 16,416 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపింది. మొత్తం 2,20,288 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొంటారని సీఈసీ వెల్లడించింది.