గుజరాత్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే జామ్‌నగర్ నార్త్ స్థానం రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. భాజపా తరఫున ప్రముఖ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య పోటీచేస్తుండగా.. ఆమెకు ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తున్నారు ఆయన సోదరి నయ్‌నబా జడేజా. ధరల పెరుగుదల.. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ ఓట్లను అడుగుతున్నారు.
జామ్‌నగర్ నార్త్ నుంచి భాజపా తరఫున రవీంద్ర జడేజా భార్య రివాబా పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ నుంచి బిపేంద్రసింగ్ జడేజా పోటీచేస్తున్నారు. తొలుత కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించిన నయ్నబాకు నిరాశే ఎదురైంది. దీంతో పార్టీ ప్రకటించిన అభ్యర్థికి మద్దతుగా నియోజకవర్గమంతా స్టార్ క్యాంపైనర్‌గా మారి ప్రచారం చేస్తున్నారు. భాజపా సైతం సిట్టింగ్ ఎమ్మెల్యే ధర్మేంద్ర సింగ్ జడేజాను పక్కకుపెట్టి రివాబాకు టికెట్ కేటాయించింది.
తనకు ఓ సిద్ధాంతం ఉందని.. దానిని అభిమానించే కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని చెప్పారు నయ్‌నబా జడేజా. ధరల పెరుగుదల, ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శించిన ఆమె.. భాజపా హామీలు మాత్రమే ఇస్తోందని.. వాటిని నేరవేర్చదని ఆరోపించారు. అంతకుముందు గెలిచిన భాజపా అభ్యర్థి.. కాంగ్రెస్ వ్యక్తేనని, ఈ సారి గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు.