Gujarat Poll Strategy: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో కాంగ్రెస్ మళ్లీ చర్చలు ప్రారంభించింది. గత ఏడాది కూడా ఆయనతో పార్టీ అధినాయకత్వం సంప్రదింపులు జరిపింది. ఆ సమయంలో ప్రశాంత్ కిశోర్ వ్యూహకర్తగా కాకుండా.. పార్టీ పదవిని చేపట్టే అవకాశం ఉందన్న ఊహాగానాలొచ్చాయి. కానీ ఆ చర్చలు అర్ధంతరంగా ముగిశాయి. మళ్లీ ఇప్పుడు 2022 చివర్లో జరిగే గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ రంగంలోకి దిగుతారన్న వార్తలు పార్టీలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాందీ తొలి దఫా చర్చలు జరిపినట్లు సమాచారం.
కాంగ్రెస్ వ్యూహకర్తగా మళ్లీ పీకే.. ఆ రాష్ట్ర ఎన్నికల బాధ్యతలు అప్పగింత! - Congress election strategy
Gujarat Poll Strategy: కాంగ్రెస్ వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ మళ్లీ పనిచేయనున్నారని సమాచారం. కిశోర్ సేవలను కేవలం గుజరాత్, హిమాచల్ రాష్ట్రాలకు పరిమితం చేస్తే బాగుంటుందని భావిస్తున్నారట. ఇప్పటికే ఆయనతో రాహుల్, ప్రియాంక తొలి దఫా చర్చలు జరిపారని తెలుస్తోంది.
అయితే.. కిశోర్ రాకపై పార్టీలో కొందరు అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు తాజా గోవా ఎన్నికలను ఉదాహరణగా చూపిస్తున్నారు. గోవాలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ పనిచేశారు. కానీ అక్కడ మమతా బెనర్జీ పార్టీ ఒక్క సీటూ నెగ్గలేదు. 2017లో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు ప్రశాంత్ కిశోర్ సేవలందించారు. ఆ ఎన్నికల్లో పార్టీ కేవలం ఏడు సీట్లకే పరిమితమైంది. పైగా ఇటీవల కాంగ్రెస్... జాతీయ స్థాయి వ్యూహకర్త బాధ్యతలను సునీల్ కనుగోలుకు అప్పగించింది. గతంలో కిశోర్‌తో కలిసి పనిచేసిన సునీల్... ఇప్పటికే తన పని ప్రారంభించారు. 2023లో జరిగే కర్ణాటక ఎన్నికల వ్యూహాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు వ్యూహకర్తలు ఉంటే పార్టీకి లాభం కంటే నష్టం ఎక్కువ వచ్చే ప్రమాదం ఉందని కొందరు హెచ్చరిస్తున్నారు. ప్రశాంత్ కిశోర్ సేవలను కేవలం గుజరాత్, హిమాచల్ రాష్ట్రాలకు పరిమితం చేస్తే బాగుంటుందని అంటున్నారు. అయితే కిశోర్ విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అధిష్ఠానం సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
ఇదీ చదవండి:'రాష్ట్రపతి పదవి ఆఫర్ ఇచ్చినా తీసుకోను'