గుజరాత్లో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. మరోవైపు.. పలు గ్రామాల ప్రజలు స్వీయ నియంత్రణ చర్యలు చేపట్టి వైరస్ను తమ ఊరిలోకి ప్రవేశించకుండా నిలువరిస్తున్నారు. అలాంటి కోవకే చెందుతుంది మెహ్సానా జిల్లా బేచరాజీ తాలుకాలోని చాందని గ్రామం. ఇప్పటికీ ఆ గ్రామం కరోనా రహితంగా ఉంది. ఆ ఊరిలో దాదాపు మొత్తం యువకులు ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లగా.. ఎక్కువ శాతం వృద్ధులే ఉండటం మరో విశేషం.
స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష!
ఆ గ్రామంలో 70-100 మంది వృద్ధులు ఉంటారు. కరోనా రెండో దశ విజృంభణలోనూ ఆ ఊరిలో ఒక్కటంటే ఒక్క కేసు నమోదు కాకపోవటం చాలా గొప్ప విషయమనే చెప్పాలి. స్వీయ క్రమశిక్షణతో కరోనా నిబంధనలు పాటిస్తూ వైరస్ను తమ ఊరిలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు గ్రామస్థులు. వారు గ్రామం నుంచి బయటకు వెళ్లరు, బయటి వారిని ఊరిలోకి రానివ్వరు. అందరూ మాస్క్ ధరిస్తారు, శానిటైజ్ చేసుకుంటారు, భౌతికదూరం పాటిస్తారు. ప్రధానంగా అందరూ హోంక్వారంటైన్లోనే ఎక్కువగా ఉంటారు.