గుజరాత్లో అక్టోబర్ 30న బ్రిటిష్ కాలం నాటి వేలాడే మోర్బీ వంతెన కూలిపోయి 135 మంది మరణించిన ఘటనపై ఆ రాష్ట్ర హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వానికి, స్థానిక అధికారులకు నోటీసులు జారీ చేసింది. నవంబర్ 14 లోపు ఈ విషయంపై నివేదికను సమర్పించమని చీఫ్ జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ అశుతోష్ శాస్త్రితో కూడిన డివిజన్ బెంచ్ గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూడా నవంబర్ 14 లోపు ఈ విషయంపై నివేదికను దాఖలు చేయాలని ఆదేశించింది.
మచ్చు నదిపై నిర్మించిన ఈ వంతెన కొన్నేళ్లగా నిరుపయోగంగా ఉండి దాదాపు ఏడు నెలలు మరమ్మతులు చేసి ఇటీవల అక్టోబర్ 26 నే తెరిచారు. అయితే ఇంతలోనే ఈ ఘోర ప్రమాదం జరిగింది. వంతెనను చూడటానికి వచ్చినవారంతా బ్రిడ్జి కూలడం వల్ల నదిలో పడిపోయారు. అయితే అందులో 135 మంది మృతి చెందగా, 170 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు గుజరాత్ ప్రభుత్వం తెలిపింది.