ఈ మధ్యకాలంలో 'వింత' వంటకాలు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. పాప్‌కార్న్ సలాడ్, చాక్లెట్ బిర్యాని, చిప్స్ కర్రీ వంటి డిషెస్ వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఆ జాబితాలో 'ఫాంటా ఆమ్లెట్' చేరింది.
ఫాంటాతో ఎలా?
గుజరాత్ సూరత్‌లో ఓ స్ట్రీట్ ఫుడ్ స్టాల్లో ఈ ఫాంటా ఆమ్లెట్ ఫేమస్! దీనినే 'ఫాంటా ఫ్రై'గా పిలుస్తున్నారు. ఉడకపెట్టిన గుడ్లు, కారం, ఉడకపెట్టిన బంగాళదుంపలు, పుదీనా చట్నీ, ఫాంటాతో చేస్తారు ఈ ఫాంటా ఫ్రై. దీని ధర ప్లేటుకు రూ. 250. ఈ ఫాంటా ఆమ్లెట్ మేకింగ్ వీడియో ఓ ప్రముఖ ఫుడ్ బ్లాగర్ తమ యూట్యూట్ ఛానెల్లో పోస్ట్ చేశారు. అది కాస్తా ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ వెరైటీ డిష్‌ను ట్రై చేసిన ఆ ఫుడ్ బ్లాగర్.. 'రుచికరంగానే ఉంది' అంటూ సైగలు చేశారు.
అయితే నెటిజన్లు మాత్రం ఈ డిష్‌ను స్వాగతించలేకపోయారు. 'అసలు ఎందుకు ఈ ప్రయత్నం చేశారు?', 'ప్రపంచంలో ఎన్నో రకాల వంటలు ఉండగా.. నేను ఇదే ఎందుకు చూశాను?' అని ట్వీట్లు చేస్తున్నారు. ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ కూడా ఈ ఫాంటా ఆమ్లెట్‌పై సెటైర్లు వేసింది.