తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గుజరాత్​లో వర్ష బీభత్సం.. 14 మంది మృతి.. 'మహా'లో 89 మంది!

భారీ వర్షాలు గుజరాత్​, మహారాష్ట్ర రాష్ట్రాల ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎడతెరపి లేకుండా పడుతున్న వర్షాలకు మహారాష్ట్రలో 89 మంది ప్రాణాలు కోల్పోగా.. గుజరాత్​లో కేవలం 24 గంటల్లో 14 మంది చనిపోయారు. రెండు రాష్ట్రాల్లోనూ అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి.

గుజరాత్​లో వరదలు
గుజరాత్​లో వరదలు

By

Published : Jul 13, 2022, 1:45 PM IST

గుజరాత్​లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. గతకొద్ది రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు భారీగా ప్రాణనష్టం సంభవించింది. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల మధ్య 24 గంటల్లో 14 మంది వర్షాల కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో తొమ్మిది మంది నీట మునిగిన కారణంగా మృతిచెందినట్లు తెలిపారు.

వర్షాల ధాటికి చాలాచోట్ల లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. జనజీవనం స్తంభించింది. ఇప్పటివరకు 31వేల మందికి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.

గుజరాత్​లో పొంగిపొర్లుతున్న వాగులు
వరదలకు నీట మునిగిన గ్రామాలు

వర్షాల ధాటికి ధ్వంసమవడం వల్ల కచ్​, నవ్​సరీ, దాంగ్ జిల్లాలోని మూడు జాతీయ రహదారులను బ్లాక్​ చేశారు. రాష్ట్రంలోని 51 స్టేట్​ హైవేలు సహా 400కు పైగా పంచాయతీ రోడ్లు దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు. సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్​ ప్రాంతాల్లో మరో 24 గంటలు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ వాతావరణ శాఖ రెడ్​ అలర్ట్​ ప్రకటించింది.

కుండపోత వానలకు తీవ్రంగా ప్రభావితమైన జిల్లాల్లో సర్వే చేపట్టి తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్​ అధికారులను ఆదేశించారు. నర్మద, ఛోటా ఉదేపుర్​, నవసరీ జిల్లాల్లో సీఎం ఇప్పటికే ఏరియల్​ సర్వే నిర్వహించారు. బుధవారం.. రాష్ట్రంలోని భరుచ్​ జిల్లాలో అత్యధికంగా 233 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

జలమయం అయిన రోడ్లు
గుజరాత్​లో వరదలు

మహారాష్ట్రలోనూ వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది. భారీ వర్షాల ధాటికి మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 89కి చేరింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. పుణె, నాశిక్, లాతుర్​, నాగ్​పుర్​ సహా మొత్తం 27 జిల్లాలు వర్షాల ధాటికి ప్రభావితమయ్యాయని అధికారులు వెల్లడించారు. 68 మంది తీవ్రంగా గాయపడగా.. నలుగురు గల్లంతు అయ్యారని పేర్కొన్నారు. 7,796 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు.

ఇదీ చూడండి :Viral video: పట్టపగలే బ్యాంకు దోపిడీకి యత్నం.. సెక్యూరిటీ గార్డు పోరాటంతో..

ABOUT THE AUTHOR

...view details