తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రశాంతంగా ముగిసిన గుజరాత్​ రెండో దశ పోరు.. ఈవీఎంల్లో ప్రజా తీర్పు నిక్షిప్తం - గుజరాత్​ ఎన్నికలు 2022 ఎగ్జిట్​ పోల్స్​

Gujarat Election 2022: గుజరాత్‌ రెండో విడత ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. రెండో విడతలో మొత్తం 14 జిల్లాల్లోని 93 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. సాయంత్రం ఐదు గంటల వరకు 59.11 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఈసీ తెలిపింది.

gujarat elections 2022
gujarat elections 2022

By

Published : Dec 5, 2022, 5:01 PM IST

Updated : Dec 5, 2022, 8:04 PM IST

Gujarat Election 2022: ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా సొంతరాష్ట్రమైన గుజరాత్​లో రెండో దశ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. డిసెంబర్​ 1న తొలి విడతలో 19 జిల్లాల పరిధిలోని 89స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. సోమవారం 14 జిల్లాల్లోని 93 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ 93 స్థానాల్లో 61 పార్టీలకు చెందిన 833 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మరో 285 మంది స్వతంత్ర అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. సాయంత్రం ఐదు గంటల వరకు 59.11 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

ఓటేసిన ప్రధాని మోదీ.. నడుచుకుంటూ వెళ్లి, క్యూలో నిల్చుని..
గుజరాత్ ఎన్నికల్లో భాగంగా ప్రధాని మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్ నగరంలోని రాణిప్ ప్రాంతంలోని నిషాన్‌ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్‌లో మోదీ ఓటు వేశారు. సాధారణ ఓటర్లలాగే వరుసలో నిలబడి ప్రధాని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మోదీ సోదరుడు సోమాభాయ్​ మోదీ, తల్లి హీరాబెన్​ మోదీ కూడా ఓటేశారు.

ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోదీ
ఓటు వేసిన ప్రధాని తల్లి, సోదరుడు

రెండో విడత ఎన్నికల్లో పలువురు ప్రముఖులు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేంద్రమంత్రి అమిత్ షా అహ్మదాబాద్‌లోని నారన్‌పురా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు. అహ్మదాబాద్‌లోని షిలాజ్ అనుపమ్‌ పాఠశాలలో ఉత్తర్‌ప్రదేశ్‌ గవర్నర్ ఆనందీ బెన్ పటేల్ ఓటు వేశారు. గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సతీమణితో కలిసి వచ్చి అహ్మదాబాద్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ వీకే సక్సేనా సతీమణితో కలిసి వచ్చి అహ్మదాబాద్‌లో ఓటు వేశారు. పటీదార్ ఉద్యమనేత హార్దిక్ పటేల్‌ అహ్మదాబాద్‌లోని చంద్రానగర్‌ పోలింగ్ స్టేషన్‌లో ఓటువేశారు. మాజీ క్రికెటర్లు యూసఫ్​ పఠాన్​, ఇర్ఫాన్ పఠాన్​ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటేసిన గుజరాత్​ సీఎం భూపేంద్ర పటేల్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా
ఓటు వేసిన మాజీ క్రికెటర్లు యూసఫ్​ పఠాన్​, ఇర్ఫాన్​ పఠాన్​

కాంగ్రెస్​, భాజపా నాయకుల మధ్య ఘర్షణ.. కేసు నమోదు
రాష్ట్రంలోని రెండో దశ ఎన్నికలు జరుగుతున్న వేళ.. బనస్కాంత జల్లాలోని దంతా అసెంబ్లీ పరిధిలో ఘర్షణ వాతావరణ నెలకొంది. కాంగ్రెస్​, భాజపా అభ్యర్థుల మద్దతుదారులు కొట్టుకున్నారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇరు పార్టీలకు చెందిన నాయకుల వాహనాలు పరస్పరం ఢీకొన్నాయని, తర్వాత గొడవపడినట్లు జరిగిందని పోలీసులు తెలిపారు. అయితే కాంగ్రెస్​ అభ్యర్థి కాంతిభాయ్ ఖరాడీపై భాజపా నేతలు దారుణంగా దాడి చేశారని ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

ఓటు వేసేందుకు వీల్​ఛైర్​లో వచ్చిన ఓటర్లు
కాలుతో ఓటువేసిన దివ్యాంగుడు

వరుసగా ఏడోసారి..
27ఏళ్లుగా గుజరాత్‌లో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ.. వరుసగా ఏడోసారి పట్టు నిలబెట్టుకోవాలని భావిస్తోంది. ఈసారి కూడా అధికారం భాజపా వశమైతే పశ్చిమ బంగాల్‌లో వామపక్ష కూటమి పేరిట ఉన్న రికార్డ్‌ను చేరుకుంటుంది. బంగాల్‌లో వామపక్ష కూటమి వరుసగా ఏడుసార్లు గెలిచి.. 2011వరకు అధికారంలో కొనసాగింది.

Last Updated : Dec 5, 2022, 8:04 PM IST

ABOUT THE AUTHOR

...view details