తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గుజరాత్ పీఠం కోసం కాంగ్రెస్ నయా ప్లాన్​.. 'బాదామ్'​తో రంగంలోకి.. - గుజరాత్ ఎన్నికల లేటెస్ట్ న్యూస్

Gujarat Elections 2022 Congress: గుజరాత్​ ఎన్నికల్లో ఈసారి తమ పార్టీ జెండాను ఎగరవేయాలని కాంగ్రెస్ పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తోంది. అయితే కాంగ్రెస్​కు ఈ ఎన్నికల్లో భాజపాతో పాటు ఆప్ మరో అడ్డంకిగా మారింది. దీంతో రెండు పార్టీలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌ నేతలు 'బాదామ్‌' వ్యూహంతో రంగంలోకి దిగుతున్నారు. అసలు ఈ బాదామ్​ వ్యూహం అంటే ఏంటి?

Gujarat Elections 2022 Congress
Gujarat Elections 2022 Congress

By

Published : Nov 17, 2022, 7:11 AM IST

Gujarat Elections 2022 Congress: ఉన్నారో లేదో తెలియని స్థితి! తమ నాయకుడెవరో తేల్చుకోలేని పరిస్థితి! అహ్మద్‌ పటేల్‌లాంటి వారి అండాదండా కూడా లేకుండా పోయిన వేళ.. నరేంద్రమోదీ-అమిత్‌షాలను ఎదుర్కోవటం అంటే సాహసమే! అనివార్యంగా అలాంటి సాహసమే చేస్తోంది గుజరాత్‌ కాంగ్రెస్‌! ఓట్లు వస్తున్నా సీట్లు రాని హస్తం పార్టీ ఈసారి ఆప్‌ రూపంలో మరో అడ్డంకినీ ఎదుర్కొంటోంది!

80ల వరకూ గుజరాత్‌ను ఏలిన కాంగ్రెస్‌ ఆ తర్వాతి నుంచి డీలా పడింది.
గుజరాత్‌లో కాంగ్రెస్‌ సొంతంగా అధికారంలోకి వచ్చింది 1985లో! అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ పార్టీని అధికారం వెక్కిరిస్తూనే ఉంది. (1990లో జనతాదళ్‌ నేత చిమన్‌భాయ్‌ పటేల్‌ తన ఎమ్మెల్యేలతో కలసి పార్టీ మారటంతో కాంగ్రెస్‌కు అనూహ్యంగా అధికారం కలసి వచ్చింది. అంతేగాని సొంతగా మాత్రం కాదు.) నరేంద్రమోదీ రాకతో కాంగ్రెస్‌కు అధికారమనేది అందని ద్రాక్షగా మారింది. పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారుతూ వచ్చింది. నరేంద్రమోదీ ముందు సరితూగే నాయకుడు రాష్ట్ర కాంగ్రెస్‌కు లేకుండా పోయారు.

అలాగని ఓట్ల శాతం దారుణంగా ఏమీ పడకపోవటం గమనార్హం. 35 శాతం.. ఆపైనే కాంగ్రెస్‌ ఓట్లను కాపాడుకుంటూ వస్తోంది. మోదీ ప్రధానిగా దిల్లీకి వచ్చాక గుజరాత్‌లో కాంగ్రెస్‌ కాస్త ఊపిరి పీల్చుకుంది. అలాగని అధికారాన్ని అందుకునేంతగా మాత్రం కాదు. 2017 ఎన్నికల్లో 41 శాతానికిపైగా ఓట్లతో 77 సీట్లు సంపాదించింది. భాజపాకు గట్టి పోటీనిచ్చింది. 20 ఏళ్లలో తొలిసారి భాజపాను మూడంకెల లోపు సీట్లకు కట్టడి చేయగలిగింది.

ఆ అంకెలను చూసే ఈసారి ఎన్నికలపై కాంగ్రెస్‌ ఆశలు పెంచుకుంది. కానీ మోదీ బృందంపై పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాడుతున్న ఆ పార్టీకి ఈసారి అనూహ్యంగా ఆప్‌ రూపంలో మరో అడ్డంకిని అధిగమించాల్సిన అవసరం పుట్టుకొచ్చింది. మిణుకుమిణుకు మంటున్న తమ ఆశలను ఆప్‌ ఊడ్చేస్తుందేమోననే బాధ, భయం పట్టుకుంది. రాష్ట్రంలో పార్టీ పెద్దదిక్కు, వ్యూహకర్త అహ్మద్‌పటేల్‌ మరణం కాంగ్రెస్‌కు భారీ లోటు. ఆయన ఎత్తుగడల కారణంగానే గత ఎన్నికల్లో భాజపాకు కాంగ్రెస్‌ గట్టి పోటీనివ్వగలిగింది. గత ఎన్నికల్లో తమవైపున్న హార్దిక్‌ పటేల్‌లాంటి పాటిదార్‌ నేత భాజపా గూటికి చేరుకున్నారు.

దీనికి తోడు అధిష్ఠానం కూడా గుజరాత్‌ కాంగ్రెస్‌ నేతలను గాలికి వదిలేసింది. పాదయాత్రలో ఉన్న రాహుల్‌గాంధీ చుట్టే అంతా తిరుగుతున్నారు. ఆయన కూడా చుట్టపు చూపుగా కొద్దిరోజులు ప్రచారానికి రావొచ్చని అంటున్నారు. దీంతో.. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు తమంతట తాముగా నిశ్శబ్దంగా ఎవరికి వారు విజయం కోసం ప్రయత్నిస్తున్నారు. తమ పాత ఓటు బ్యాంకుపై నమ్మకంతో సాగుతున్నారు. నిజానికి గుజరాత్‌లో కాంగ్రెస్‌ పైకి కనిపించినంత బలహీనమేమీ కాదు. గ్రామీణ ప్రాంతాల్లో ఆ పార్టీకి గట్టి పట్టుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంతాల్లో భాజపా కంటే ఎక్కువ ఓట్లు, సీట్లు గెల్చుకుంది కాంగ్రెస్‌. ఆ పార్టీకి వచ్చిన 77 సీట్లలో 71 గ్రామీణ ప్రాంతాల్లో గెల్చుకున్నవే అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

భాజపా నుంచి పోటీకి తోడు ఆప్‌ నుంచీ దాడి మొదలైన నేపథ్యంలో.. కాంగ్రెస్‌ నేతలు బాదామ్‌ వ్యూహంతో రంగంలోకి దిగుతున్నారు. బాదామ్‌ అంటే.. బక్షి కమిషన్‌ (ఓబీసీలు), ఆదివాసీలు, దళితులు, అంజనా చౌదరి (హిందూ జాట్లు), ముస్లింలు. వీరందరి ఓట్లను నమ్ముకొని ఎన్నికల్లో నెగ్గాలనేది కాంగ్రెస్‌ నేతల ఆలోచన. సంప్రదాయంగా.. పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్‌ బలహీనం. పట్టణ ప్రాంతాల్లో భాజపాకు పట్టుంది. ఆప్‌కూ పట్టున్నది అక్కడే. కాబట్టి.. ఈ ఎన్నికల్లో ఏమైనా ప్రభావం ఉంటే అది పట్టణ ప్రాంతాల్లో ఆప్‌ నుంచి భాజపాకు ఉంటుందిగాని కాంగ్రెస్‌కు కాదన్నది వారి వాదన. ఆయా వర్గాలను ఆకట్టుకోవటానికి ఆప్‌కు పోటీగా తాము కూడా హామీలు గుప్పించారు.

గుజరాత్​లో కాంగ్రెస్ పరిస్థితి

ABOUT THE AUTHOR

...view details