Gujarat Election Result 2022 : 27 ఏళ్లుగా గుజరాత్‌లో ఏకచక్రాధిపత్యం చెలాయిస్తున్న భారతీయ జనతా పార్టీ.. మరోసారి తన జోరును కొనసాగిస్తోంది. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలకు తగ్గట్టే భాజపా ఆధిక్యం కనబరుస్తోంది. మిగతా పార్టీలకు అందనంత దూరంలో స్పష్టమైన ఆధిపత్యంతో దూసుకెళుతోంది. కాంగ్రెస్, ఆప్‌ను వెనక్కి నెడుతూ ఆధిక్యంలో కొనసాగుతోంది. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, మరో కీలక నేత హార్దిక్ పటేల్ ముందంజలో ఉన్నారు. ఈసారి భాజపా విజయం సాధిస్తే వరుసగా ఏడోసారి గెలిచి అత్యధిక కాలం అధికారంలో ఉన్న పార్టీగా రికార్డు సృష్టించనుంది.
వరుసగా ఏడోసారి?
గుజరాత్‌లో అధికార భాజపా వరుసగా ఏడోసారి జయభేరి మోగించాలని ఊవిళ్లూరుతోంది. ఎగ్జిట్ పోల్స్ కూడా భాజపా విజయం తథ్యమని అంచనా వేశాయి. గుజరాత్‌లో అధికారం చేపట్టేందుకు అవసరమైన మెజార్టీ మార్క్ 92 సీట్లు కాగా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం భాజపాకు 117 నుంచి 151 సీట్ల వరకు రావచ్చని లెక్కగట్టాయి. కాంగ్రెస్ పార్టీకి 16 నుంచి 51, ఆమ్‌ఆద్మీకి 2 నుంచి 13 సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశాయి.