తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీ ఇంట కమలానికి పరీక్ష.. 2017లో అవమానం.. తర్వాత ఊరట.. మరి ఈసారి? - ఉంఝా నియోజకవర్గం న్యూస్

ప్రధాని మోదీ స్వస్థలం వాద్​నగర్ ఓటర్లు ఈసారి ఏ పార్టీని గెలిపిస్తారనేది గుజరాత్ ఎన్నికల్లో చర్చనీయాంశంగా మారింది. ఉంఝా నియోజకవర్గం పరిధిలో వాద్​నగర్ ఉంది. 2017 ఎన్నికల్లో ఇక్కడ భాజపా ఓడిపోగా.. కాంగ్రెస్ తరఫున గెలిచిన అభ్యర్థి భాజపాలో చేరారు. అనంతరం, 2019 ఉపఎన్నికల్లో గెలిచారు. దీంతో ఈసారి పోరుపై ఆసక్తి నెలకొంది.

MODI BJP GUJARAT
MODI BJP GUJARAT

By

Published : Dec 3, 2022, 6:54 AM IST

గుజరాత్‌లోని ఉంఝా నియోజకవర్గంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కారణం- ప్రధాని మోదీ స్వస్థలం వాద్‌నగర్‌ ఈ స్థానం పరిధిలోనే ఉంది. అందుకే ఈ నియోజకవర్గాన్ని మోదీతో ముడిపెట్టి చూస్తుంటారు. ఉత్తర గుజరాత్‌లోని మెహసానా జిల్లాలో ఉన్న ఉంఝా.. రెండో విడతలో భాగంగా ఈ నెల 5న ఎన్నికలకు వెళుతోంది. గత ఎన్నికల ఫలితాన్ని చూశాక.. ఇక్కడి పరిస్థితిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. 1995 నుంచి ఉంఝాలో గెలుస్తూ వచ్చిన భాజపా 2017 ఎన్నికల్లో పరాజయం పాలైంది. కాంగ్రెస్‌కు చెందిన ఆశాపటేల్‌ భాజపా అభ్యర్థిని నాడు ఓడించారు. మోదీ స్వస్థలంలో భాజపా చతికిలపడటం ఆశ్చర్యపరిచింది. పార్టీకి అదో అనూహ్య అవమానం!

తర్వాత కొద్దిరోజులకే ఆశాపటేల్‌ భాజపాలో చేరి 2019 ఉప ఎన్నికల్లో గెలిచారు. దీంతో మళ్లీ ఈ సీటు కమలనాథుల ఖాతాలోనే చేరినట్లయింది.2017 ఓటమి భాజపాను వెంటాడుతూనే ఉంది. ఆ పార్టీ ఈసారి ఆరెస్సెస్‌ సీనియర్‌ కార్యకర్త కీర్తికుమార్‌ కేశవ్‌లాల్‌ను బరిలోకి దించింది. ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌కు సన్నిహితుడైన 67 ఏళ్ల కీర్తిభాయ్‌ సులభంగా నెగ్గుతారనేది భాజపా విశ్వాసం. కాంగ్రెస్‌ నుంచి అర్వింద్‌ అమర్త్‌లాల్‌ పటేల్‌, ఆప్‌ తరఫున ఉర్విష్‌ పటేల్‌ బరిలో ఉన్నారు. పాటీదార్‌ ఉద్యమం, స్థానిక ఎమ్మెల్యేపై వ్యతిరేకత కారణంగా గత ఎన్నికల్లో ఓడిపోయినా.. ఈసారి గెలుపుపై కమలనాథులు ధీమాగా ఉన్నారు.

ఉత్తరాన ఆధిపత్యమెవరిదో!
గుజరాత్‌లో 93 సీట్లకు ఈ నెల 5న పోలింగ్‌ జరగనుంది. రాజకీయంగా కీలకమైన ఈ నియోజకవర్గాలన్నీ ఉత్తర (32), సెంట్రల్‌ గుజరాత్‌ (61)ల్లో ఉన్నాయి. గత ఎన్నికల్లో సెంట్రల్‌ గుజరాత్‌లో భాజపా 37 సీట్లు గెల్చుకుంది. 22 స్థానాలు కాంగ్రెస్‌ ఖాతాలో చేరాయి. ఇద్దరు స్వతంత్రులు నెగ్గారు. 2012 ఫలితాలతో పోలిస్తే ఇక్కడ భాజపా సీట్లు (ఆ ఎన్నికల్లో 52) తగ్గడం గమనార్హం. ఉత్తర గుజరాత్‌లోని ఆరు జిల్లాల్లో 32 సీట్లకుగాను 2017లో కాంగ్రెస్‌ 17 చోట్ల నెగ్గగా, కమలదళానికి 14 మాత్రమే దక్కాయి. ఈసారి ఆప్‌ దెబ్బతీయకుంటే ఉత్తర గుజరాత్‌లో కాంగ్రెస్‌కే మొగ్గు ఉంటుందన్న అంచనాలు వెలువడుతున్నాయి.

తొలి దశ పోలింగ్‌లో 63.31% ఓటింగ్‌
గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌లో నమోదైన సగటు ఓటింగ్‌ 63.31శాతంగా తేలింది. 19 జిల్లాల పరిధిలోని 89 నియోజకవర్గాల్లో ఓటర్లు గురువారం ఓటు హక్కు వినియోగించుకున్న విషయం తెలిసిందే. తమకు అందిన పూర్తి సమాచారాన్ని క్రోడీకరించిన తర్వాత ఎన్నికల సంఘం శుక్రవారం తుది గణాంకాలను అధికారికంగా వెల్లడించింది.

గిరిజనుల ప్రాబల్య జిల్లా నర్మదలో అత్యధికంగా 78.24%, తాపి జిల్లాలో 76.91%, నవసారి జిల్లాలో 71.06% అత్యధిక ఓటింగ్‌ నమోదు కావడం విశేషం. బోటాద్‌ జిల్లాలో అతి తక్కువగా 57.58 శాతం మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. అమ్రేలి జిల్లాలో 57.59 శాతం, సూరత్‌ జిల్లాలో 62.27%, రాజ్‌కోట్‌ జిల్లాలో 60.45శాతం ఓట్లు పోలయ్యాయి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో తొలి దశలో పోలింగ్‌ జరిగిన ఇదే 89 నియోజకవర్గాల్లో 66.75 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అప్పటికంటే ఇప్పుడు 3.42 శాతం మంది తక్కువగా పోలింగ్‌ కేంద్రాలకు వచ్చినట్లు స్పష్టమవుతోంది.

ABOUT THE AUTHOR

...view details