PM Modi news : కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. తనను దుర్భాషలాడటంలో ఆ పార్టీ నేతల మధ్య పోటీ నడుస్తోందని ఫైరయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. మోదీని రావణుడిగా పేర్కొంటూ విమర్శించిన నేపథ్యంలో మోదీ తాజాగా స్పందించారు. గుజరాత్ పంచమహల్ జిల్లాలోని కాలోల్ పట్టణంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన మోదీ.. ఇతర కాంగ్రెస్ నేతలు సైతం తనపై అనుచిత విమర్శలు చేశారని, ఓ కుటుంబాన్ని సంతోషపెట్టేందుకు వారు ఎంత దూరమైనా వెళ్తారని అన్నారు. కాంగ్రెస్ నేతలు తనపై బురదజల్లేందుకు ప్రయత్నించిన ప్రతిసారి కమలం వికసిస్తుందని చెప్పుకొచ్చారు.
"నేను ఖర్గేను గౌరవిస్తా. పైన ఉన్నవారు ఆయన్ను ఏది చెప్పమంటే అదే చెప్తారు. ఇది రామభక్తులు ఉన్న గుజరాత్ అని కాంగ్రెస్ పార్టీకి తెలియదు. రాముడి అస్థిత్వాన్ని విశ్వసించనివారే ఇప్పుడు.. రామాయణంలోని రావణుడిని తెరపైకి తెచ్చారు. 'మోదీని వంద తలల రావణుడు' అని అనిపించారు. అంతకుముందు మరో నేత 'మోదీకి ఆయన స్థానమేంటో చూపిస్తాం' అని అన్నారు. అలాంటి కఠిన పదాలు నాపై ప్రయోగించిన వారు.. క్షమించమని అడగడం పక్కనబెడితే.. కనీసం పశ్చాత్తాపం వ్యక్తం చేయడం లేదు. మోదీకి వ్యతిరేకంగా ఎవరు ఎక్కువగా దుర్భాషలాడతారనే విషయంపై కాంగ్రెస్ నేతల మధ్య పోటీ నడుస్తోంది.