ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో శాసనసభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అన్నివర్గాల ప్రజలు ఓటుహక్కును వినియోగించేందుకు ఉత్సాహం చూపించారు. వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు కూడా కుటుంబసభ్యులతో వచ్చి ఓటువేశారు. మొత్తం 60.20 ఓటింగ్ నమోదైనట్లు ప్రకటించింది ఎన్నికల సంఘం.
ప్రశాంతంగా ముగిసిన గుజరాత్ తొలి దశ పోలింగ్.. 60.20 శాతం ఓటింగ్ నమోదు - గుజరాత్ లైవ్ న్యూస్
20:07 December 01
17:41 December 01
5 గంటల వరకు 56.88 శాతం ఓటింగ్
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల వరకు 56.88 శాతం ఓటింగ్ నమోదైనట్లు ప్రకటించింది ఎన్నికల సంఘం.
17:01 December 01
ముగిసిన తొలి దశ పోలింగ్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో శాసనసభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అన్నివర్గాల ప్రజలు ఓటుహక్కును వినియోగించేందుకు ఉత్సాహం చూపించారు. వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు కూడా కుటుంబసభ్యులతో వచ్చి ఓటువేశారు. పోలింగ్ ఆరంభమైన తొలిగంటలోనే 5శాతం ఓటింగ్ నమోదుకాగా.. మధ్యాహ్నం 3 గంటల వరకు దాదాపు 48.48 శాతం రికార్డయినట్లు ఈసీ వెల్లడించింది.
వివిధ పార్టీలకు చెందిన ప్రముఖులు కూడా చాలావరకు ఉదయాన్నే పోలింగ్‌కేంద్రానికి వెళ్లి ఓటువేశారు. మాజీ సీఎం విజయ్ రూపానీ , క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా రాజ్‌కోట్‌లో ఓటు వేశారు. ఇంకా వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలు ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు రాజ్‌కోట్ యువరాజు దంపతులు వింటేజ్‌కారులో వెళ్లి ఓటు వేశారు. భాజపా అధ్యక్షుడు సీఆర్ పాటిల్.. సూరత్‌లో ఓటుహక్కు వినియోగించుకున్నారు. వల్సాద్ జిల్లా ఉంబర్‌గావ్ నియోజకవర్గంలో శతాధిక ఓటరు కముబెన్ పటేల్‌ఓటు వేసినట్లు తెలిపింది. 104 ఏళ్ల వృద్ధుడు రాంజీ భాయ్ సైతం పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేశారు.
15:37 December 01
3 గంటల వరకు 48.48 శాతం ఓటింగ్
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యాహ్నం 3 గంటల వరకు 48.48 శాతం ఓటింగ్ నమోదైనట్లు ప్రకటించింది ఎన్నికల సంఘం.
14:02 December 01
ఒంటి గంట వరకు 34.48 శాతం పోలింగ్
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యాహ్నం ఒంటిగంట వరకు 34.48 శాతం ఓటింగ్ నమోదనట్లు ప్రకటించింది ఎన్నికల సంఘం.
12:11 December 01
ఓటేసిన కేంద్రమంత్రి మాండవీయ
కేంద్రమంత్రి, భాజపా నేత మన్సుఖ్ మాండవీయ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. భావ్‌నగర్‌లోని హనోల్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.
11:38 December 01
ఉదయం 11 గంటల వరకు 18.95 శాతం ఓటింగ్
ఉదయం 11 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 18.95 శాతం ఓటింగ్ నమోదైంది. డాంగ్ జిల్లాలో అత్యధికంగా 7.76 శాతం నమోదు కాగా.. పోర్బందర్లో అత్యల్పంగా 3.92 శాతం ఓటింగ్ నమోదైంది. జామ్‌నగర్‌లో 4.42, మోర్బీలో 6.17, కఛ్‌లో 5.06, దేవ్‌భూమి ద్వారకాలో 4.09 శాతం పోలింగ్ నమోదైంది.
10:47 December 01
ఓటేసిన క్రికెటర్ రవీంద్ర జడేజా
ప్రముఖ క్రికెటర్ రవీంద్ర జడేజా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జామ్‌నగర్‌లోని పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేశారు జడేజా. అనంతరం మాట్లాడిన జడేజా.. ప్రజలు అధిక సంఖ్యలో ఎన్నికల్లో పాల్గొని ఓటు వేయాలని కోరారు. మరోవైపు కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తున్న ఆయన తండ్రి అనిరుద్ధ్ సిన్హ్, సోదరి నైనా జడేజా కూడా జామ్‌నగర్ పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
09:41 December 01
ఓటేసిన వందేళ్ల వృద్ధురాలు.. 9 గంటల వరకు 4.92 శాతం ఓటింగ్
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 4.92 శాతం ఓటింగ్ నమోదైంది. మరో వైపు 100 ఏళ్ల వృద్ధురాలు ఓటేసి తన కర్తవ్యాన్ని చాటుకున్నారు. ఉమర్గామ్కు చెందిన కముబెన్ పటేల్ అనే వృద్ధురాలు పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేశారు.
09:27 December 01
ఓటు వేసిన గుజరాత్ భాజపా చీఫ్ సీఆర్ పాటిల్
దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలకు నిరసన తెలుపుతూ వినూత్నంగా ఓటు వేసేందుకు వెళ్లారు కాంగ్రెస్ ఎమ్మెల్యే పరేశ్ ధనని. ఆయనతో పాటు మరో ఇద్దరు యువతులు సైకిళ్లు తొక్కుకుంటూ వెనుక గ్యాస్ బండను కట్టుకుని పోలింగ్ కేంద్రానికి పయనమయ్యారు. గుజరాత్ భాజపా చీఫ్ సీఆర్ పాటిల్ సూరత్‌లోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
08:41 December 01
ఓటేసిన రివాబా
గుజరాత్ ఎన్నికల్లో ఓటేసేందుకు ప్రజలు బారులు తీరారు. ప్రముఖులు సైతం ఉదయమే పోలింగ్ కేంద్రాలకు విచ్చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి పూర్ణేశ్ మోదీ.. సూరత్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యప్రదేశ్ గవర్నర్ మంగూభాయ్ పటేల్, ఆయన భార్యతో కలిసి నవసారిలో ఓటేశారు. జామ్‌నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న భాజపా నాయకురాలు, క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా.. రాజ్‌కోట్‌లో ఓటు వేశారు.
08:00 December 01
పోలింగ్ షురూ...
గుజరాత్ అసెంబ్లీకి తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది. ప్రజలందరూ తప్పక ఓటేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
07:44 December 01
మాక్ పోలింగ్
గుజరాత్ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓటింగ్ ప్రారంభానికి ముందు.. పలు బూత్‌లలో మాక్ పోలింగ్ నిర్వహించారు. భరూచ్‌లోని పిరమాన్ పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మాక్ పోలింగ్ చేపట్టారు. మోర్బీలోని నీల్‌కంఠ్ విద్యాలయ్లోనూ మాక్ పోలింగ్ నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ఓటింగ్ ప్రారంభం కానుంది.
07:27 December 01
మోదీ-షా ఇలాఖాలో ఎన్నికలు.. తొలిదశ పోలింగ్‌కు సర్వం సిద్ధం
గుజరాత్‌లో తొలిదశ పోలింగ్ నేడే
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఈ ప్రక్రియను ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకూ కొనసాగుతుంది. 19 జిల్లాల పరిధిలోని 89 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న 788 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు నిర్దేశిస్తారు. రాష్ట్రంలో అర్హులైన మొత్తం ఓటర్లు 4.91 కోట్లు కాగా తొలి విడతలో 2.39 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సాధారణంగా భాజపా, కాంగ్రెస్‌ల మధ్య ఉండే ఎన్నికల పోరు ఈ సారి ఆప్ రంగ ప్రవేశంతో త్రిముఖ పోటీగా మారింది. 2017లో తొలి దశలో పోలింగ్ జరిగిన 89 స్థానాల్లో భాజపా-48, కాంగ్రెస్-40 సీట్లను గెలుచుకోగా స్వతంత్ర అభ్యర్థి ఒకరు విజయం సాధించారు.