Gujarat Election 2022 : విద్యుత్ ఉచితంగా పొందడానికి బదులు.. కరెంట్ నుంచి ఆదాయం పొందే సమయమిది అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విద్యుత్ నుంచి ఎలా సంపాదించాలో తనకు తెలుసునని చెప్పారు. కాంగ్రెస్ 'విభజించు పాలించు' రాజకీయాలని చేస్తోందని.. వాళ్ల తపనంతా కేవలం అధికారంలోకి రావడం కోసమేనని ఆరోపించారు. అరవల్లి జిల్లాలోని మోడస టౌన్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన ర్యాలీలో ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు నరేంద్ర మోదీ.
'మెహ్సానా జిల్లాలోని మొధేరా గ్రామం సోలార్ విద్యుత్‌తో నడుస్తోంది. వాళ్లకు కావాల్సినంత వాడుకుని.. మిగులు విద్యుత్‌ను ప్రభుత్వానికి అమ్ముకుంటున్నారు. ఇంతకుముందు టీవీ, ఫ్రిజ్, ఏసీ లాంటివి లేని మొధేరా గ్రామంలోని మహిళలు.. ఇప్పుడు వాటన్నింటినీ కొనుగోలు చేస్తున్నారు. ఈ వ్యవస్థను గుజరాత్ మొత్తం తీసుకురావాలనుకుంటున్నాను. ఇలా చేయడం మోదీకి మాత్రమే తెలుసు. ఇలాంటి విప్లవం గుజరాత్‌లోని ప్రతి ఇంటికి తీసుకొచ్చేలా నేను పని చేస్తున్నాను. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్ మీకు దగ్గరలోనే ఉంది. ఆ రాష్ట్రంలో మీరేమైనా అభివృద్ధిని చూశారా? ఆ రాష్ట్రంలో ఏదైనా మంచి విషయం జరగడాన్ని చూశారా? కాంగ్రెస్‌కు అభివృద్ధి చేయడం ఎప్పుడూ చేతకాదు' అని మోదీ పేర్కొన్నారు.