గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ గురువారం విడుదల చేసింది. 160 స్థానాల్లో పోటీ చేసేవారి పేర్లను భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో వెల్లడించారు. ఘట్లోదియా అసెంబ్లీ స్థానం నుంచి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, మజురా నుంచి హోంమంత్రి హర్ష్ సంఘావి బరిలోకి దిగనున్నారని తెలిపారు. పాటీదార్ ఉద్యమ నేత హార్ధిక్ పటేల్‌కు విరంగమ్ సీటును కేటాయించారు. అలాగే టీమ్ ఇండియా క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబాకు కూడా భాజపా తరఫున టికెట్ ఇచ్చారు.
ఈ జాబితాలో 14 మంది మహిళలు, 13 మంది ఎస్సీలు, 24 మంది ఎస్టీలకు చోటు కల్పించారు. ప్రస్తుత జాబితాలో 69 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మాత్రమే చోటు దక్కగా గత ఎన్నికల్లో గెలిచిన సభ్యులకు ఈసారి మొండిచేయి ఇచ్చినట్లే తెలుస్తోంది. మోర్బీ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటును నిరాకరించింది. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ, మాజీ ఉపముఖ్యమంత్రి నితిన్ పటేల్ సహా పలువురు సీనియర్లు ఈసారి పోటీకి దూరంగా ఉంటామని అధిష్ఠానానికి లేఖ రాసినట్లు భాజపా తెలిపింది.
మోర్బీ నుంచి కాంతీలాల్ అమృతియా.. ఆ సాహసానికి ప్రశంసిస్తూ..
గుజరాత్ ఎన్నికల్లో మోర్బీ నుంచి అసెంబ్లీ స్థానం అక్కడి మాజీ ఎమ్మెల్యే కాంతిలాల్ అమృతియాకు దక్కింది. మోర్బీ ఘటన సమయంలో నదిలోకి దూకి మరి కాంతీలాల్ ప్రజలను కాపాడినందుకుగానూ ఆయన కృషికి ప్రశంసించి ఈ టిక్కెట ఆయనకు ఇస్తున్నట్లు భాజపా వెల్లడించింది. అయితే అదే స్థానానికి పోటీ చేయాలనుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే బ్రిజేష్ మెర్జాకు నిరాశే మిగిలింది.