Gujarat Election 2022 : చీపురు గుర్తుతో దిల్లీ, పంజాబ్‌లను ‘ఊడ్చేసిన’ ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు గుజరాత్‌లోనూ సంచలనానికి ఉవ్విళ్లూరుతోంది. కమలనాథుల గడ్డపై కేజ్రీవాల్ తొడకొడుతున్నారు. తమదైన ఉచితాలతో భాజపా, కాంగ్రెస్‌లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. మరి మోదీ స్వరాష్ట్రంలో భాజపా అప్రతిహత విజయపరంపరను కేజ్రీవాల్ ‘ఆప్’తారా? లేక కాంగ్రెస్‌ను దెబ్బతీసి భాజపా మళ్లీ అధికారంలోకి రావటానికి కారణమవుతారా?
gujarat election 2022
By
Published : Nov 13, 2022, 7:19 AM IST
Gujarat Election 2022 : ‘‘గుజరాత్‌లో భాజపా మోసం ఇక కొనసాగదు. ఉద్రేకాలు కాదు.. ఉద్యోగాలిస్తాం. స్కూళ్లు కడతాం, మంచి చదువులిస్తాం. ఉచిత వైద్యమిస్తాం. గుజరాత్‌లో పోటీ ఇక మాకు, భాజపాకు మధ్యే! కాంగ్రెస్ కనుమరుగైంది!’’.. ఇదీ ఆమ్‌ఆద్మీపార్టీ జాతీయ కన్వీనర్, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మోదీ గడ్డపై నిలబడి చేసిన ప్రకటన! గత రెండు నెలల్లో ఆయన దిల్లీలో కంటే గుజరాత్‌లోనే ఎక్కువ గడిపారు. భాజపా, కాంగ్రెస్ కంటే ముందే అభ్యర్థులను ప్రకటించి, ప్రచారాన్ని కూడా మొదలెట్టేశారు. అంతేకాదు.. తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా పరిచయం చేశారు. మొత్తానికి రెండున్నర దశాబ్దాలకుపైగా ద్విముఖపోరుగా కొనసాగుతున్న గుజరాత్ ఎన్నికలను ఈసారి ఆప్ వచ్చి త్రిముఖ పోరుగా మార్చింది.
ప్రచారంలో ముందంజ.. గుజరాత్‌లో ఆప్ అడుగుపెట్టడం ఇది తొలిసారేం కాదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో (2017) కూడా కేజ్రీవాల్ పార్టీ పోటీ చేసింది. ఒక్కసీటు కూడా గెల్చుకోలేదు. 0.1 శాతం మాత్రమే ఓట్లు సంపాదించింది. అలాగని ఆ అంకెలను చూసి ఆప్‌ను ఈసారి తీసిపారేయలేని పరిస్థితి. ఈ ఐదేళ్లలో ఆప్... రాష్ట్రంలో గణనీయమైన పార్టీగా ఎదిగింది. అందరికీ తెలిసేలా విస్తరించింది. సూరత్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను వెనక్కి నెట్టి భాజపా తర్వాత అత్యధిక సీట్లు సంపాదించిన పార్టీగా ఆవిర్భవించింది. గాంధీనగర్‌లోనూ అదే జరిగింది. పంజాబ్‌లో విజయభేరితో ఆప్ పేరు మరింతగా ప్రాచుర్యంలోకి వచ్చి.. గుజరాత్ ఎన్నికల్లో ఈసారి బలమైన ప్రత్యర్థిగా రంగంలోకి దిగటానికి దోహదం చేసింది. అంతేకాదు తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో కూడా కేజ్రీవాల్ అందరికంటే ముందే ప్రకటించేశారు. 300 యూనిట్ల దాకా కరెంట్, విద్య, వైద్యం ఉచితం, 18 ఏళ్లపైబడిన మహిళలకు నెలకు రూ.వెయ్యి; రూ.3వేల నిరుద్యోగ భృతి, గోసంరక్షణ కింద ఒక్కో ఆవుకు రోజుకు రూ. 40 లాంటి.. తాయిలాలతో ప్రజల్లో చర్చను లేవనెత్తారు.
ఓట్లు సీట్లు తెచ్చేనా? ఇలా ఎన్నికల ఎజెండాను సిద్ధం చేయటంలో కేజ్రీవాల్ ముందున్నారు. కానీ విజయానికి ఈ ఎజెండా ఒక్కటే సరిపోతుందా అంటే లేదనే సమాధానం వస్తుంది. ఎందుకంటే.. 182 సీట్లున్న గుజరాత్ అసెంబ్లీలో విజయం సాధించాలంటే త్రిముఖ పోరులో కనీసం 35%పైగా ఓట్లు సాధించాల్సి రావొచ్చు. ద్విముఖ పోరు సాగిన గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 41 శాతంపైనే ఓట్లు వచ్చినా ఫలితం లేకపోయింది. ఆప్‌నకు ఈసారి ఎన్నికల్లో ఓట్ల శాతం పెరగటం ఖాయంగా కనిపిస్తోంది. కానీ అవి ఎన్ని సీట్లుగా మారతాయనేది ఆసక్తికరం! ఆప్‌ను కేవలం ఓట్లు చీల్చే పార్టీగా కొట్టిపారేసేవారూ లేకపోలేదు. కాంగ్రెస్ ఓట్లనే ఆప్ చీలుస్తుందనే భావన వ్యక్తమవుతోంది. అంతిమంగా భాజపాకు ఆప్ లాభం చేకూరుస్తుందని కొంతమంది విశ్లేషణ. పట్టణ ప్రాంత ప్రజల్లో ఎక్కువ ప్రభావం చూపే పార్టీగా ఆప్‌కు పేరుంది. పట్టణాల్లో కాంగ్రెస్‌కు ఉన్న ఓట్లను ఆప్ చీల్చే అవకాశాలు పుష్కలం. అయితే.. పట్టణ ప్రాంతాల్లో బలంగా ఉన్న భాజపా ఓటు బ్యాంకును కూడా ఆప్ కొల్లగొట్టే అవకాశాల్లేకపోలేదు. పాటిదార్లను ఆకట్టుకునే ప్రయత్నాలను ఆప్ బలంగా చేస్తోంది.
భాజపాపై దాడి చేస్తూనే.. కాంగ్రెస్ ఈ ఎన్నికల సీన్‌లో లేదనే భావనను ఆప్ సృష్టిస్తోంది. రాష్ట్రంలో పోటీ తమకు భాజపాకు మధ్యే అనే భావన పెంచుతోంది. ‘కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ఏమీ లాభం లేదు. వారిలో చాలామంది మళ్లీ భాజపాలో చేరతారు. గత ఎన్నికల్లో గుజరాత్‌లో జరిగింది అదే.. గోవాలో జరిగిందదే’ అంటూ ఆప్ ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్‌కు పట్టున్న గ్రామీణ ప్రాంతాల్లో ఈ వాదనను బలంగా వినిపిస్తోంది. మొత్తానికి.. గత ఎన్నికల్లో సోదిలో లేని ఆమ్ ఆద్మీ పార్టీ గాలి ఐదేళ్లు తిరిగేసరికి పెరిగిందన్నది నిజం. అయితే ఆ గాలికి సీట్లెన్ని రాలుతాయన్నదే ఆసక్తికరం!