తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎన్నికలకు ముందే క్యాంపు రాజకీయం! అభ్యర్థులను కాపాడుకునేందుకు ఆప్ ప్లాన్ - గుజరాత్ అసెంబ్లీ నామినేషన్

గుజరాత్​లో ఎన్నికలకు ముందే క్యాంపు రాజకీయాలు షురూ అయ్యాయి. తమ అభ్యర్థులను రహస్య ప్రదేశానికి తరలించింది ఆమ్ ఆద్మీ పార్టీ. బుధవారం ఓ అభ్యర్థి నామినేషన్ వెనక్కి తీసుకున్న నేపథ్యంలో ఇలా జాగ్రత్త పడుతోంది.

Surat Aam Admi party
Surat Aam Admi party

By

Published : Nov 17, 2022, 2:21 PM IST

గుజరాత్ ఎన్నికల బరిలో దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ.. తమ అభ్యర్థుల విషయంలో జాగ్రత్తపడుతోంది. సూరత్ ఈస్ట్ అభ్యర్థి కంచన్ జరీవాలా బుధవారం తన నామినేషన్​ను వెనక్కి తీసుకున్న నేపథ్యంలో.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేప్టటింది. ఎట్టి పరిస్థితుల్లోనూ నామినేషన్లు విత్​డ్రా చేసుకోకూడదని అభ్యర్థులకు సూచించింది. సూరత్​కు చెందిన పార్టీ అభ్యర్థులను గుర్తు తెలియని ప్రాంతానికి తరలించింది. నగరానికి అవతల ఓ ప్రాంతానికి వీరిని తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. సూరత్​లోని స్థానాల్లో నామినేషన్ల ఉపసంహరణకు గురువారమే ఆఖరి రోజు కావడం వల్ల ఈ మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఆప్ వర్గాలు మాత్రం.. వీరందరినీ ఓ సమావేశం కోసం పిలిచామని అంటున్నాయి. అభ్యర్థులంతా తమతమ నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకుంటున్నారని ఆప్ ప్రతినిధి యోగేశ్ జద్వానీ పేర్కొన్నారు.

కాగా, బుధవారం తన నామినేషన్​ను ఉపసంహరించుకున్న కంచన్ జరీవాలా.. తనకు రక్షణ కల్పించాలంటూ పోలీసులకు లేఖ రాశారు. తన ప్రాణానికి హాని ఉందని, కాంగ్రెస్ అభ్యర్థి అస్లాం సైకిల్​వాలా మనుషులు తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. తనకు భద్రత కల్పించాలని కోరుతూ సూరత్ పోలీస్ కమిషనర్​ను అభ్యర్థించారు.

జరీవాలా.. మంగళవారం కనిపించకుండా పోయారు. బుధవారం నేరుగా రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ప్రత్యక్షమైన జరీవాలా.. తన నామినేషన్​ను వెనక్కి తీసుకున్నారు. అయితే, ఆయన్ను భాజపా కిడ్నాప్ చేసిందని ఆప్ ఆరోపణలు చేసింది. భాజపా ఒత్తిడి వల్లే ఆయన.. నామినేషన్ ఉపసంహరించుకోవాల్సి వచ్చిందని ఆప్ ఆరోపించగా.. కమలదళం తోసిపుచ్చింది.

ABOUT THE AUTHOR

...view details