చైనా యాప్ ద్వారా జరిగిన రూ.50 కోట్ల భారీ మోసాన్ని బయటపెట్టారు గుజరాత్ అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. యాప్ ద్వారా పెట్టుబడుల పేరుతో రూ.6,000 నష్టపోయినట్లు ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదుతో విచారణ జరిపిన అధికారులు.. మోసాలకు పాల్పడిన ముఠాను ఛేదించారు. చైనీస్ యాప్ ద్వారా పలు మార్గాల్లో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా 28,000 మంది నష్టపోయినట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఈ కేసుకు సంబంధించి గతంలో ఏడుగురుని అరెస్టు చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. వారిలో యాసిన్ ఖురేషి, దిలీప్ గోజియా, ధర్మేంద్ర సింగ్ రాథోడ్, రాహుల్ వధేర్, జయేశ్ గగియా తుషార్ ఘెటియా ఉన్నట్లు చెప్పారు. మహారాష్ట్రకు చెందిన జితేన్ షా పేరు కూడా ఉన్నట్లు తెలిపారు. మూడు నెలల్లో అతని కంపెనీ బ్యాంకు ఖాతాలో రూ.30 కోట్లు జమ అయిందని.. ఇందుకు ప్రతిగా కమీషన్ కూడా చెల్లించినట్లు పేర్కొన్నారు. అదే సమయంలో మరో నిందితుడి ఖాతాల్లో రూ.20 కోట్లు జమ అయినట్లు తెలిపారు. సోషల్ నెట్‌వర్క్ ద్వారా ప్రజలను సంప్రదిస్తున్న చైనాకు చెందిన ఓ భారతీయ వ్యక్తి ఈ వ్యవహారాన్ని నడుపుతున్నట్లు పోలీసు విచారణలో తేలింది.