జల్సాలకు అలవాటుపడి, డబ్బుల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు కొందరు యువకులు. వాటి ద్వారా ఎదురయ్యే పరిణామాలను సైతం లెక్క చేయటం లేదు. గుజరాత్‌కు చెందిన ఓ యువకుడు.. చదివింది పదో తరగతే అయినా మత్తుపదార్థాల్ని తయారు చేసేందుకు ఏకంగా ఓ మినీ ల్యాబ్‌నే ఏర్పాటు చేశాడు. చివరకు కటకటాలపాలయ్యాడు.
యూట్యూబ్‌లో చూసి..
సూరత్‌లోని(Gujarat Surat News) వరచ్చా ప్రాంతంలో నివసించే జైమన్ సావనీ.. పదో తరగతి పాస్ అయ్యాడు. లాక్డౌన్లో అతడు మత్తుపదార్థాలకు అలవాటు పడ్డాడు. సులభంగా డబ్బులు సంపాదించేందుకు డ్రగ్స్ తయారు చేసి, అమ్మాలనుకున్నాడు. దాంతో యూట్యూబ్‌లో చూసి, గుట్టుగా ఓ మినీ ల్యాబ్‌ను(Lab for drugs) ఏర్పాటు చేశాడు. అయితే.. సూరత్ ఎస్ఓజీ అధికారులు అతని ల్యాబ్‌పై దాడులు చేసి అరెస్టు చేశారు.
సర్తానాలోని రాజ్వీర్ కాంప్లెక్స్‌లో సావనీ కార్యాలయంపై పోలీసు బృందం దాడులు జరిపింది. డ్రగ్స్ తయారు చేసేందుకు వినియోగించే ల్యాబ్ పరికరాలు, ముడి పదార్థాలను స్వాధీనం చేసుకుంది.