గుజరాత్లో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. సగటున 60 శాతం ఓటింగ్ నమోదైంది. . రాష్ట్రంలోని 81 మున్సిపాలిటీలు, 31 జిల్లా పంచాయతీలు, 231 తాలుకా పంచాయతీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. కరోనా నిబంధనల మధ్య భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
ఓటిగ్ ఎక్కడెక్కడ? ఎంతెంత?
- 31 జిల్లా పంచాయతీల్లో 62.34 శాతం ఓటింగ్ నమోదు కాగా.. 231 తాలుకా పంచాయతీల్లో 63.23 శాతం ఓటింగ్ నమోదైంది. 81 మున్సిపాలిటీల్లో 54.82 శాతం ఓటింగ్ నమోదైంది.
- తాపి జిల్లాలోని వేరాలో అత్యధికంగా 70 శాతం ఓటింగ్ నమోదైంది.
- కచ్ జిల్లా గంధిధామ్లో అత్యల్పంగా 40 శాతం ఓటింగ్ నమోదైంది.
ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పోలిస్తే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటింగ్ శాతం మెరుగైంది. ఓటర్లు ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ రోజు పెళ్లి చేసుకోబోయే ఓ జంట.. రాజ్‌కోట్‌లోని గోండల్ తాలుకాలోని పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసింది. గాంధీనగర్‌లోని దెహ్గామ్ తాలుకాలోని పెళ్లి చేసుకున్న ఓ నవదంపతులు ఓటింగ్‌లో పాల్గొన్నారు.
తాపి జిల్లాలోని బుహారీలో మొదటి సారి ఓటు వేసేందుకు వచ్చిన వారికి పూలబొకేలతో అధికారులు స్వాగతం పలికారు. ఓటింగ్‌లో వృద్ధులు ఉత్సాహంగా పాల్గొని ఆదర్శంగా నిలిచారు. జామ్‌నగర్ జిల్లాలని పిపర్టోడాలో ఓ 112 ఏళ్ల వృద్ధురాలు ఓటు వేశారు.