తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఐదేళ్ల క్రితం 77.. ఇప్పుడు 17.. కాంగ్రెస్​ దుస్థితికి 10 కారణాలివే.. - reasons for congress defeat in gujarat elections

భారత్​ జోడో యాత్రతో పార్టీ శ్రేణుల్లో పునరుత్తేజం నింపేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్​కు.. గుజరాత్​ ఎన్నికల రూపంలో గట్టి షాక్ తగిలింది. భాజపా కంచుకోటను బద్దలు కొట్టలేకపోగా.. కనీసం బలమైన ప్రతిపక్షంగా కూడా నిలవలేని దుస్థితికి చేరింది. 2017 ఎన్నికలతో పోల్చితే ఈసారి హస్తం గుర్తుపై గెలిచిన అభ్యర్థుల సంఖ్య భారీగా పడిపోయింది. కేవలం 17 స్థానాలకే పరిమితమైంది. ఎందుకిలా?

Gujarat Assembly Election Result 2022
Gujarat Assembly Election Result 2022

By

Published : Dec 8, 2022, 1:53 PM IST

Updated : Dec 8, 2022, 6:01 PM IST

Gujarat Assembly Election Result 2022 : గుజరాత్​లో కాంగ్రెస్​ పరిస్థితి మరింత దిగజారింది. 1995లో 149 సీట్లు సాధించి రికార్డు సృష్టించిన కాంగ్రెస్.. అప్పటి నుంచి వరుసగా ఏడు సార్లు ఓటమిపాలైంది. 2017లో కాస్త తేరుకున్నా.. 2022లో మాత్రం బోల్తా కొట్టింది. భాజపా ధాటికి తట్టుకోలేక చతికిలపడిపోయింది. కేవలం 17 సీట్లు మాత్రమే గెలుచుకుంది. గుజరాత్​లో కాంగ్రెస్​ ఓటమికి పది ప్రధాన కారణాలు ఇవే..

గుజరాత్​లో కాంగ్రెస్​ ఓటమికి 10 ప్రధాన కారణాలు:

1. మోదీని ఢీకొట్టే నాయకుడు లేకపోవడం :
గుజరాత్​లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అంతా తానై ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 'అభివృద్ధి' అనే మంత్రంతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్​పై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఇక కాంగ్రెస్​ పార్టీలో మోదీని ఢీకొట్టే నాయకుడు కరవయ్యాడు. మోదీకి ప్రత్యామ్నాయంగా ఓ నేత ఉండాలనే విషయంపై కాంగ్రెస్​ అధిష్ఠానం దృష్టి సారించలేదు.

2. కొరవడిన వ్యూహ చతురత :
ఎన్నికల్లో వ్యూహకర్తలు కీలక పాత్ర పోషిస్తారు. ఓటర్ల నాడిని తెలుసుకుని వాటికి అనుగుణంగా వ్యూహాలు రచిస్తారు. అయితే అహ్మద్​ పటేల్​ లాంటి సీనియర్​ నాయకుడు, వ్యూహకర్తను కాంగ్రెస్​ కోల్పోయింది. అలా కాంగ్రెస్​కు​ దూరమైన ఆ నాయకుడి లోటును కాంగ్రెస్​ తీర్చుకోలేకపోయింది. దీని కారణంగా ఎన్నికల యుద్ధానికి సమాయత్తం కాలేకపోయింది. అవసరమైన వనరులు, మద్దతు సమకూర్చుకోలేకపోయింది.

3. పార్టీ అంతర్గత సమస్యలు :
ప్రధానంగా కాంగ్రెస్​ పార్టీలో అంతర్గత సమస్యలు, కుమ్ములాటలు, అలకలు ఎక్కువగానే ఉన్నాయి. దీంతో పార్టీ సమస్యలు తీర్చడానికే సమయం లేదు. ఎన్నికలపై దృష్టి సారించడం కష్టంగా మారింది. ఇక క్షేత్ర స్థాయి నాయకులను.. నియోజకవర్గ స్థాయిలో ఉన్న నేతలను సరిగా ఉపయోగించుకోలేదు. పదవి దక్కని సీనియర్లు.. పదవిలో ఉన్న వారికి సహకరించలేదు. ఈ కారణంగానే పార్టీని సంస్థాగతంగా బలపరచలేక, బలంగా ఉన్న భాజపాను కాంగ్రెస్​ ఢీకొట్టలేకపోయింది.

4. కాంగ్రెస్​ నుంచి ఇతర పార్టీలకు వలసలు :
కాంగ్రెస్​ పార్టీలో వలసలు కూడా ఆ పార్టీ ఒటమికి కారణం. టికెట్​ ఇవ్వనందుకు, తదితర కారణాల వల్ల అసంతృప్త నేతలు అధికార పార్టీకి వెళ్లడం.. అక్కడ టికెట్​ పొంది విజయం సాధించడం పరిపాటిగా మారిపోయింది. కాంగ్రెస్​ పార్టీకి పాటిదార్​ వర్గంలో ఓట్లు అంతంత మాత్రమే. పాటీదార్​ రిజర్వేషన్​ ఉద్యమ నేత హార్దిక్​ పటేల్​ భాజపాలోకి వెళ్లడం వల్ల.. ఆ ఓట్లు కూడా దూరమయ్యాయి. అదే కాకుండా భాజపా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్​ కోటా కూడా ఆ వర్గం ఓట్లను కాంగ్రెస్​కూ దూరం చేసింది.

5. వ్యతిరేకతను వాడుకోలేకపోవడం :
భాజపాపై ఉన్న వ్యతిరేకతను కూడా కాంగ్రెస్​.. ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమైంది. మోర్బీ ఘటన, బిల్కిస్​ బానో దోషుల విడుదల లాంటి అంశాలపై కూడా తన గళం బలంగా వినిపించలేకపోయింది. పైగా తిరిగి విమర్శలు చేసిన భాజపాను ఎదుర్కోలేకపోయింది.

6. తేలిపోయిన ప్రచారం :
ఇక ప్రచారం విషయానికొస్తే.. కాంగ్రెస్​ స్టార్​ క్యాంపెయినర్​గా భావించే రాహుల్​ గాంధీ.. భారత్​ జోడో యాత్రలో ఉన్న కారణంగా ప్రచారంలో సరిగా పాల్గొనలేదు. శశి థరూర్ లాంటి కొంత మంది అగ్ర నేతలు కూడా ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఒక ప్రతిపక్ష పార్టీగా.. అధికార పక్షానికి దీటుగా స్పందించాలి. కానీ అది అత్యంత పురాతన పార్టీ అయిన కాంగ్రెస్​లో కొరవడింది. ఈ విషయంలో ఆప్​ ఎన్నికలకు దాదాపు రెండేళ్ల ముందు నుంచి సన్నద్ధం అవుతోంది.

7. ఆప్​ రాక :
గుజరాత్​లో 1995లో కాంగ్రెస్​ విజయం సాధించిన తర్వాత. వరుసగా ఏడు పర్యాయాలు ఓటిమిపాలైంది. 2017లో కాస్త తేరుకుని 77 సీట్లు సాధించింది. ఈసారి ఆమ్ ఆద్​మీ పార్టీ రాక కాంగ్రెస్​ కొంప ముంచింది. ఆ పార్టీ భాజపా వ్యతిరేక ఒట్లను చీల్చి కాంగ్రెస్​ ఆశల మీద నీళ్లు చల్లింది. 2017 ఆప్​ ఏం తేడా చూపించలేక పోయినా.. ఈ అయిదేళ్లలో మాత్రం పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది.

8. ఓట్ల చీలిక..
అర్బన్​ ప్రాంతాల్లో భాజపాపై వ్యతిరేకత ఉన్న యువ ఓటర్లను ఆప్​ తనవైపుకు తిప్పుకుంది​. ఇక గిరిజనుల ఓట్లను నమ్ముకున్న కాంగ్రెస్​ను దెబ్బతీయడానికి.. భాజపా గిరిజన మహిళను రాష్ట్రపతి చేయడం లాంటి ప్రయత్నాలు చేసింది. ఇదే కాకుండా ప్రధానంగా భాజపా వ్యతిరేక ఓటు అంటే ముస్లింలే. వారి ఓట్లు కూడా ఎమ్​ఐఎమ్ రాకతో చిలీపోయాయి. ఈ చీలిక కూడా కాంగ్రెస్​ ఓట్లు నష్టపోవడానికి కారణం.

9. ఓటుబ్యాంకును కాపాడుకోలేక.. :
కాంగ్రెస్​కు ఎస్సీ, ఎస్టీ, ముస్లింలే ప్రధాన ఓటు బ్యాంకు. ముస్లింలు మినహా మిగతావాళ్లు హిందుత్వ సిద్ధాంతాలతో ప్రభావితం అయ్యారు. హిందుత్వ సిద్ధాంతానికి కౌంటర్​గా​ ఏ వ్యూహాన్ని కాంగ్రెస్​ అమలు చేయలేదు. ఆఖరికి ఆదివాసీలు, దళితుల హక్కుల కోసం ఆశించిన స్థాయిలో పోరాడలేదు. ఇకపోతే 2002లో జరిగిన గుజరాత్​ అల్లర్ల తర్వాత కుడా మైనారిటీల హక్కుల గురించి కాంగ్రెస్​ నిలబడలేదు. ఎన్​జీఓలే ఈ కేసును కోర్టుకు తీసుకెళ్లాయి.

10 . అధిష్ఠానంలో స్వేచ్ఛ లేమి :
ఇప్పటివరకు కుటుంబ పార్టీ అని ప్రతిపక్షాలు కాంగ్రెస్​ను విమర్శించాయి. దాంతో పార్టీకి గాంధీయేతర నాయకుడే అధ్యక్షుడు కావాల్సి వచ్చింది. కానీ, పార్టీ అంతా గాంధీల కనుసన్నల్లోనే నడుస్తోందన్న మాట జగమెరిగిన సత్యం. స్వతంత్రంగా వ్యవహరించే శశిథరూర్​ లాంటి నాయకుల్ని కాదని.. తమకు అనుగుణంగా ఉండే మల్లిఖార్జున్​ ఖర్గేకు పట్టం కట్టింది గాంధీ కుటుంబం. దీని కారణంగా పార్టీలో మార్పులకు అవకాశం లేకుండా పోయింది. దీంతో అన్ని రకాలుగా బలహీనపడి పార్టీ ఓటమికి దారితీసింది.

Last Updated : Dec 8, 2022, 6:01 PM IST

ABOUT THE AUTHOR

...view details