తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రికార్డులు బ్రేక్.. గుజరాత్ కింగ్​గా భాజపా.. ఫలించిన మోదీ 'టార్గెట్-150' - గుజరాత్ ఎన్నికలు బీజేపీ రికార్డు

గుజరాత్​ కింగ్ భాజపానే అని తేలిపోయింది. కమలం కంచు కోటను బద్దలు కొట్టడం ఆషామాషీ కాదని స్పష్టమైంది. 'గెలవడం కాదు.. రికార్డులు బద్దలు కొట్టాలి' అన్న మోదీ ఆశయం ఫలించింది. తాజా ఎన్నికల్లో గెలవడం ద్వారా అనేక రికార్డులను సొంతం చేసుకుంది భాజపా.

GUJARAT BJP RECORDS
GUJARAT BJP RECORDS

By

Published : Dec 8, 2022, 4:53 PM IST

గుజరాత్ గడ్డపై కాషాయ జెండా రెపరెపలాడింది. అఖండ మెజారిటీతో కమలం పార్టీ విజయం సాధించింది. 182 స్థానాల్లో 150కిపైగా సీట్లలో భాజపా గెలుపొందింది. భాజపా గెలుపు లాంఛనమే అని మొదటి నుంచి ఊహాగానాలు వినిపించినా.. విజయం సాధించిన తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి సీట్లు కొల్లగొట్టింది. వీటితో పాటే అనేక రికార్డులనూ తన ఖాతాలో వేసుకుంది.

భాజపా సాధించిన రికార్డులు ఇవే..

  1. తాజా ఎన్నికల్లో భాజపా 150కి పైగా సీట్లు గెలిచింది. గుజరాత్​లో ఓ పార్టీ గెలుచుకున్న అత్యధిక స్థానాలు ఇవే. 1985లో మాధవ్​సిన్హ్ సోలంకీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ 149 సీట్లు గెలుచుకుంది.
  2. అత్యధిక సీట్లు దక్కించుకొని భాజపా తన సొంత రికార్డును సైతం బద్దలు కొట్టింది. గతంలో ఆరుసార్లు గెలుపొందిన భాజపా.. 2002లో గరిష్ఠంగా 127 సీట్లు గెలుచుకుంది. తాజా ప్రదర్శనతో ఆ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది.
  3. వరుసగా ఏడు సార్లు ఓ రాష్ట్రంలో మెజారిటీ సాధించడం ద్వారా మరో రికార్డును తన పేరిట లిఖించుకుంది భాజపా. 1990లో జనతా దళ్​తో కలిసి గుజరాత్​లో తొలిసారి అధికారంలోకి వచ్చిన భాజపా.. ఆ తర్వాత 1995లో జరిగిన ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ సాధించింది. అనంతరం 1998, 2002, 2007, 2012, 2017 ఎన్నికల్లో విజయం సొంతం చేసుకుంది. తాజా ఎన్నికల్లో గెలవడం ద్వారా వరుసగా ఏడోసారి సొంతంగా గెలుపొందినట్లైంది.
  4. గతంలో సీపీఎం బంగాల్​లో వరుసగా ఏడు సార్లు అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఏడుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది భాజపానే కావడం విశేషం.

మోదీ వ్యూహమే..
భాజపాదే గెలుపు అన్న అంచనాలు ఉన్న నేపథ్యంలో.. తొలి నుంచీ రికార్డు విజయంపైనే మోదీ దృష్టిపెట్టారు. 1985 నాటి గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మాధవసింహ్‌ సోలంకీ నేతృత్వంలోని కాంగ్రెస్ సాధించిన 149సీట్ల రికార్డును బద్దలుకొట్టాలని మోదీ భావించారు. ఇందుకు అనుగుణంగానే వ్యూహాలు అమలు చేశారు. కనీసం 150 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. టార్గెట్-150ని ఛేదించి గుజరాత్‌లో భాజపాకు కనీవినీ ఎరుగని విజయాన్ని సాధించిపెట్టారు. "ఈ గుజరాత్‌ను నేనే తీర్చిదిద్దాను" అనే నినాదంతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన మోదీ తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన పనుల చిట్టాను అన్ని సభల్లోనూ ప్రజల ముందుంచారు.

భారీ విజయం సాధించడం ద్వారా.. గుజరాత్​పై తాము ఏమాత్రం పట్టు కోల్పోలేదని భాజపా.. తన విరోధులకు చాటి చెప్పింది. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ వంటి కొత్తవారు బరిలో దిగినా.. తమ అధికారానికి ఢోకా లేదని నిరూపించుకుంది. విపక్షాలు ఉచితాలు, తాయిలాలు ప్రకటించి ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినప్పటికీ.. ప్రజలు తమ వెంటే ఉన్నారని చాటి చెప్పింది.

ABOUT THE AUTHOR

...view details