గుజరాత్లో దారుణం జరిగింది. డిసెంబర్లో జరగబోయే ఎన్నికల విధుల నిర్వహణకు వచ్చిన ఓ జవాన్.. తన సహచర జవాన్లపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన పోరుబందర్ సమీపంలోని ఓ గ్రామంలో శనివారం సాయంత్రం జరిగింది.
ఇదీ జరిగింది.. ఎన్నికల విధుల కోసం వచ్చిన జవాన్లు పోరుబందర్‌కు 25 కిలో మీటర్ల దూరంలో ఉన్న తుపాను పునరావాస కేంద్రంలో ఉంటున్నారు. శనివారం బస్సులో ప్రయాణిస్తుండగా.. జవాన్ల మధ్య ఏదో విషయంలో గొడవ తలెత్తింది. దీంతో ఓ జవాన్ ఫైరింగ్ చేశాడు. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం గాయపడిన వారిని జామ్‌నగర్‌లోని భావ్సింగ్జీ ఆస్పత్రికి తరలించారు.
'ఈ జవాన్లు సీఆర్పీఎఫ్ మణిపుర్ బెటాలియన్‌కు చెందిన వారు.. డిసెంబర్లో జరగబోయే ఎన్నికల కోసం విధులు నిర్వహించడానికి ఇక్కడికి వచ్చారు. గాయపడిన వారిలో ఒకరికి కడుపులో బుల్లెట్ దిగగా.. మరొకరికి కాలికి తగిలింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నాం. పోరుబందర్లో మొదటి దశలో డిసెంబర్ 1న ఎన్నికలు జరగనున్నాయి.' అని పోరుబందర్ జిల్లా కలెక్టర్ తెలిపారు.