Vaccination at weddings: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో మరో ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వైరస్ నుంచి తమను తాము కాపాడుకోవడానికి అందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని చెబుతున్నారు. కానీ, కొంతమంది మాత్రం టీకా వేసుకోవటానికి వెనుకడుగు వేస్తున్నారు. మరికొంతమంది టీకా మొదటి డోసు తీసుకున్నా.. రెండో డోసు విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో అందరికీ పూర్తి స్థాయి టీకా డోసులు పంపిణీ చేయాలనే లక్ష్యంతో గుజరాత్ అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఏఎంసీ) అధికారులు వినూత్న చర్యలు చేపట్టారు.
Amc vaccination drive: ఏఎంసీకి చెందిన ఆరోగ్య కార్యకర్తల బృందాలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న పెళ్లిళ్లు, ఇతర వేడుకలు జరుగుతున్న వేదికల వద్దకు గురువారం చేరుకున్నాయి. అక్కడకు హాజరైన వారి వ్యాక్సిన్ ధ్రువపత్రాలను పరిశీలించాయి. అర్హులైన లబ్ధిదారులు ఎవరైనా టీకా తీసుకోలేదని తెలిస్తే.. వారికి అక్కడిక్కడే ఆరోగ్య కార్యకర్తలు వ్యాక్సిన్ వేశారు. ఓ వైపు పెళ్లి వేడుక జరుగుతుండగానే మరోవైపు లబ్ధిదారులకు టీకాలు అందించారు.
"రెండో డోసు పంపిణీ చేయడానికి పెళ్లికి హాజరైన వారి వ్యాక్సిన్ ధ్రువపత్రాలను మేం పరిశీలిస్తున్నాం. గడువు ముగుస్తున్నప్పటికీ ఎవరైనా వ్యాక్సిన్ తీసుకోకుండా కనిపిస్తే.. అక్కడే వారికి టీకా వేస్తున్నాం. అహ్మదాబాద్లో 70 నుంచి 80 వైద్య కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ కంటే ముందే నగరంలో జరుగుతున్న వివాహ వేడుకల వివరాలను మేం సేకరించాం."