గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైంది. పార్టీ అంచనాలు తారుమారు అయ్యాయి. ఓటమిపాలైన వారిలో ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే సహా.. ఏడుగురు శాసనసభ సభ్యుల కుమారులూ ఉండటం పార్టీ నేతలకు మింగుడుపడటం లేదు. 81 మున్సిపాలిటీలు, 31 జిల్లా పంచాయతీలు, 231 తాలూకా పంచాయతీల ఎన్నికల ఫలితాల్లో భాజపా జోరు చూపించింది.
సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన కుమారుడూ..
కాంగ్రెస్‌కు ప్రధాన దెబ్బ.. ఆనంద్ జిల్లాలోని పెట్లాద్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన నీరంజన్ పటేల్ ఓటమే. పెట్లాద్ మున్సిపాలిటీలోని వార్డు నంబర్ 2, 5ల్లో ఓడిపోయారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు సౌరభ్ పటేల్ కూడా అదే మున్సిపాలిటీలో భాజపా అభ్యర్థిపై ఓడిపోవటం గమనార్హం.
మిగతా సిట్టింగ్ ఎమ్మెల్యేల కుమారులు వీరే..
- ఆనంద్ జిల్లా సోజిత్రా నియోజకవర్గ ఎమ్మెల్యే పూనంభాయ్ పర్మార్ కుమారుడు విజయ్ పర్మార్.. తారాపుర్ తాలుకా పంచాయత్‌లోని మోరజ్ సీటులో భాజపా అభ్యర్థిపై ఓడిపోయారు. ఆయన మేనల్లుడు నికుంజ్ పర్మార్ సైతం ఈ ఎన్నికల బరిలో నిలిచారు.
- ఖేద్బ్రహ్మా కాంగ్రెస్ ఎమ్మెల్యే అశ్విన్ కొత్వాల్ కుమారుడు యాష్ కొత్వాల్.. గిరిజనల ప్రాబల్య విజయ్‌నగర్ తాలుగా పంచాయత్‌లోని ఛితారియాలో ఓటమి చెందారు.
- భిలోడా కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిల్ జోషియారా కుమారుడు కేవల్.. భిలోడా తాలూకా పంచాయత్‌లో ఓడిపోయారు.
- గిర్ సోమ్‌నాథ్ జిల్లా ఉన్నా నియోజకవర్గంలో ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పరేశ్ వాన్ష్ కుమారుడు పుంజా వాన్ష్.. రాజ్‌పత్‌లో ఓటమిపాలయ్యారు.
- దేవ్‌భూమి ద్వారకాలోని ఖంభాలియా నియోజకవర్గ ఎమ్మెల్యే విక్రమ్ మాడమ్ కుమారుడు కరన్.. జిల్లా పంచాయతీ ఎన్నికల్లో వాద్తారా స్థానంలో ఓడిపోయారు.
- గుజరాత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అర్జున్ మోధ్వాడియా సోదరుడు రామ్‌దేవ్ మోధ్వాడియా.. పోర్బంద్ తాలూకా పంచాయతీ ఎన్నికల్లో కిందర్ఖేడా స్థానంలో ఓటమిచెందారు.
- భారతీయ ట్రైబర్ పార్టీ (బీటీపీ) ఎమ్మెల్యే ఛౌటు వాసవా కుమారుడు దిలీప్ వాసవా కూడా భారుచ్ జిల్లా పంచాయత్ ఎన్నికల్లో రాజ్పార్డీ స్థానంలో విఫలమయ్యారు.