ప్రభుత్వ ఉద్యోగం సాధించటమే లక్ష్యంగా రేయింబవళ్లు సన్నద్ధమవుతుంటారు నిరుద్యోగులు. ఏ చిన్న నోటిఫికేషన్ వచ్చినా.. దానికి దరఖాస్తు చేసేస్తుంటారు. అలాగే.. గుజరాత్ లోకరక్షక్ రిక్రూట్మెంట్ బోర్డు.. ఇటీవల 10వేల కానిస్టేబుల్ ఉద్యోగాలకు(constable recruitment gujarat) నోటిఫికేషన్ జారీ చేయగా.. విశేష స్పందన లభించింది. ఏకంగా 11.75 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
సాధారణ, సాయుధ కానిస్టేబుల్(మహిళా, పురుష), స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కానిస్టేబుల్(పురుష) నియామకాలకు(constable recruitment) నోటిపికేషన్ ఇచ్చింది లోకరక్షక్ రిక్రూట్మెంట్ బోర్డు. తుది గడువు గత మంగళవారం(నవంబర్ 9)తో ముగిసింది. మొత్తం పోస్టులు 10,459 ఉండగా.. అందులో 8,476 పురుషులు, 1,983 మహిళలకు కేటాయించారు. 12వ తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులుగా నిర్ణయించారు.
తుది గడువుకు ఒక గంట సమయం నాటికి మొత్తం 11.75 లక్షల దరఖాస్తులు రాగా.. అందులో 9.10 లక్షల అప్లికేషన్లను(6.65 లక్షల పురుష, 2.45 మహిళా అభ్యర్థుల) ఆమోదించినట్లు చెప్పారు నియామక బోర్డు ఛైర్మన్ హస్ముఖ్ పటేల్. కొందరు రెండుకన్నా ఎక్కువ సార్లు అప్లై చేసిన క్రమంలో.. దరఖాస్తుల తుది సంఖ్య 9 లక్షల లోపే ఉండొచ్చని తెలిపారు. దరఖాస్తు ఫీజు చెల్లింపులకు నవంబర్ 12 వరకు గడువు ఉందని, శారీరక పరీక్షల కోసం కాల్ లెటర్స్‌ను నవంబర్ 20 లోపు అందిస్తామన్నారు. డిసెంబర్ తొలి వారంలో ప్రారంభమై రెండు నెలల పాటు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఎంపికైన వారికి వచ్చే ఏడాది మార్చిలో రాత పరీక్ష ఉంటుందని స్పష్టం చేశారు.