తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'టూల్​కిట్'​ అరెస్టులపై రాజకీయ రగడ - విపక్షాలు భాజపా గ్రెటా టూల్​కిట్

పర్యావరణ కార్యకర్త దిశా రవినే టూల్​కిట్​ను రూపొందించి, గ్రెటా థన్​బర్గ్​కు పంపించారని దిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. టూల్​కిట్ వ్యాప్తి చేసేందుకు తయారు చేసిన వాట్సాప్ గ్రూప్​ను దిశ డిలీట్ చేశారని తెలిపారు. మరోవైపు, దిశ అరెస్టుపై రాజకీయంగా దుమారం చెలరేగుతోంది. పాలక, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆమెను విడుదల చేయాలని సామాజిక కార్యకర్తల నుంచి డిమాండ్ వినిపిస్తోంది.

Greta toolkit case: 22-year-old Disha Ravi's arrest triggers uproar
'గ్రెటాకు టూల్​కిట్ పంపింది దిశా రవినే'

By

Published : Feb 15, 2021, 6:01 PM IST

అన్నదాతల ఉద్యమానికి సంబంధించిన టూల్​కిట్​ను పర్యావరణ కార్యకర్త దిశా రవినే తయారు చేశారని దిల్లీ పోలీసులు వెల్లడించారు. మరో ఇద్దరు అనుమానితులైన నిఖితా జాకబ్(లాయర్-ముంబయి), శంతను(ఇంజినీర్-పుణె)తో కలిసి టూల్​కిట్​ను రూపొందించి, సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసినట్లు తెలిపారు. ఈ టూల్​కిట్​ను పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్​బర్గ్​కు దిశనే పంపించారని చెప్పారు.

ఇదీ చదవండి:పర్యావరణం నుంచి 'దేశద్రోహం' వరకు.. ఎవరీ దిశ?

ఈ మేరకు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన దిల్లీ సైబర్ పోలీసు విభాగం జాయింట్ కమిషనర్ ప్రేమ్​నాథ్.. టూల్​కిట్​ను వ్యాప్తి చేసేందుకు రూపొందించిన వాట్సాప్​ గ్రూప్​ను దిశ డిలీట్ చేశారని తెలిపారు. ఖలిస్థానీ అనుకూల వర్గమైన పొయెటిక్ జస్టిస్ ఫౌండేషన్(పీజేఎఫ్) నిర్వహించిన జూమ్​ మీటింగ్​కు నిఖిత, శంతను హాజరయ్యారని చెప్పారు.

"దిశ, శంతను, నిఖిత టూల్​కిట్​ను రూపొందించి, ఎడిట్ చేశారు. టెలిగ్రామ్ యాప్ ద్వారా ఈ టూల్​కిట్​ను గ్రెటా థన్​బర్గ్​కు.. దిశ పంపించారు. టూల్​కిట్​ను వ్యాప్తి చేసేందుకు క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూప్​ను దిశ డిలీట్ చేశారు. దిశ అరెస్టు సమయంలో సరైన నిబంధనలను, ప్రక్రియను పాటించాం. బెంగళూరు స్టేషన్ హౌస్ అధికారితో పాటు, దిశ తల్లి ముందే ఆమెను అదుపులోకి తీసుకున్నాం."

-ప్రేమ్​నాథ్, జాయింట్ కమిషనర్, దిల్లీ సైబర్ పోలీసు విభాగం

నికిత, శంతను కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే ఇద్దరిపై నాన్​ బెయిలబుల్​ వారెంట్లు జారీ అయినట్లు చెప్పారు.

రాజకీయ రగడ

దిశా రవి అరెస్టుపై రాజకీయ రగడ చెలరేగింది. గ్రెటా థన్​బర్గ్​ షేర్ చేసిన టూల్​కిట్​కు సంబంధించిన కేసులో పోలీసులు దిశను తమ అదుపులోకి తీసుకోవడంపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగింది. 21 ఏళ్ల యువతిపై కేంద్రం బలప్రయోగం చేస్తోందని విపక్షాలు ఆరోపించగా... నేరం ఎవరు చేసినా నేరమేనని, వయసుతో సంబంధం లేదని భాజపా సమర్థించుకుంది.

దేశం మౌనంగా ఉండదు: రాహుల్

దిశ అరెస్టుపై స్పందించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. దేశం మౌనంగా ఉండబోదని పేర్కొన్నారు. 'మీ పెదవులకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది. నిజం ఇంకా జీవించే ఉందని చెప్పండి. దేశం భయపడట్లేదు, వారే భయపడుతున్నారు. భారత్ మౌనంగా ఉండదు.' అంటూ కేంద్రానికి చురకలు అంటించారు.

కేంద్రాన్ని విమర్శిస్తూ వరుస ట్వీట్లు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం. ప్రభుత్వం నియంతృత్వ పాలన సాగిస్తోందని ఆరోపించారు. దిశా రవి అరెస్టుకు వ్యతిరేకంగా విద్యార్థులందరూ గళాన్ని వినిపించాలని పిలుపునిచ్చారు.

"యువ విద్యార్థి దిశా రవి దేశానికి ముప్పుగా పరిణమించిందని భావిస్తే.. భారతదేశం కచ్చితంగా బలహీనమైన మూలాలపై ఉన్నట్లే. రైతులకు మద్దతు తెలిపేందుకు విడుదల చేసిన టూల్​కిట్.. చైనా చొరబాట్ల కంటే ప్రమాదకరంగా మారిపోయింది. అర్థంలేని విషయాలకు భారత్ కేంద్ర బిందువుగా మారుతోంది. దౌర్జన్యం చేసే వారి చేతిలో దిల్లీ పోలీసులు ఆయుధంగా మారిపోవడం బాధాకరం."

-చిదంబరం, కాంగ్రెస్ నేత

దిశా రవితో పాటు మరో యువతి నిఖితా జాకబ్​ను అరెస్టు చేశారని, ఇంకా ఎంత మందిని అదుపులోకి తీసుకుంటారో తెలియదని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా ఖూనీ చేయబోతున్నారనే విషయానికి ఈ ఘటనలే సాక్ష్యమని పేర్కొన్నారు. "ఈ తానాషాహీ(నియంతృత్వ) పాలనను అమిత్ షాహీగా పిలవొచ్చు" అని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ సహా పలువురు ప్రముఖులు సైతం దిశ అరెస్టుకు వ్యతిరేకంగా ట్వీట్లు చేశారు.

చట్టవిరుద్ధ అపహరణ: ఆప్

దిశ రవి అరెస్టును ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. రైతులకు మద్దతు ప్రకటించడం నేరమేమీ కాదని అన్నారు.

భాజపా ప్రభుత్వం దేశంలో ఎమర్జెన్సీని విధించిందని విమర్శించింది ఆమ్​ఆద్మీ పార్టీ. భాజపాకు యువత అంటే గిట్టదని, అందుకే 21 ఏళ్ల కార్యకర్తను అరెస్టు చేసిందని ఆ పార్టీ ప్రతినిధి రాఘవ్ చద్దా పేర్కొన్నారు. 300 మంది ఎంపీలు ఉన్న భాజపా.. యువ కార్యకర్తకు భయపడి దిల్లీ పోలీసులను పంపించిందని అన్నారు. ఇలాంటి ఘటనలను యువత ఖండించాలని రాఘవ్ పిలుపునిచ్చారు.

ప్రమాదంలో ప్రజాస్వామ్యం

దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయిందని ఆర్జేడీ నేత మనోజ్ ఝా పేర్కొన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ఇప్పుడు కష్టకాలం నడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

మతిస్థిమితం లేని ప్రభుత్వం

కేంద్రంపై సీపీఎం నిప్పులు చెరిగింది. మోదీ ప్రభుత్వాన్ని మతిస్థిమితం లేని సర్కార్​గా అభివర్ణించింది. కార్యకర్తలను అణచివేయడం ఆపాలని హితవు పలికింది. దిశా రవిపై మోపిన అభియోగాలను తొలగించి, ఆమెను విడుదల చేయాలని డిమాండ్ చేసింది.

మీ ఐటీ సెల్​ సంగతేంటి?

బంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం దిశకు మద్దతుగా నిలిచారు. ఆమె అరెస్టును వ్యతిరేకించిన దీదీ.. తప్పుడు వార్తలను వ్యాప్తిచేసే భాజపా ఐటీ సెల్​ వ్యక్తులపై కేంద్రం ముందుగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన చేసే ప్రతిఒక్కరినీ అరెస్టు చేయడం సరికాదని అన్నారు.

భాజపా కౌంటర్

విపక్షాల విమర్శలపై దీటుగా స్పందించింది భాజపా. నేరం చేసిన ఎవరైనా నేరస్థులేనని, వయసుతో సంబంధం లేదని భాజపా ప్రతినిధి గౌరవ్ భాటియా అన్నారు. ముంబయి దాడులకు పాల్పడినప్పుడు కసబ్ వయసు సైతం ఇరవై ఒకటేనని చెప్పుకొచ్చారు. రైతులకు మద్దతివ్వడం తప్పుకాదని, దేశానికి వ్యతిరేకంగా కుట్ర పన్ని, ఇతరులను ఉసిగొల్పడం మాత్రం నేరమేనని కౌంటర్ ఇచ్చారు.

విపక్షాల ఆరోపణలను తిప్పికొడుతూ ట్వీట్ చేశారు కేంద్ర మంత్రి, భాజపా నేత గజేంద్ర సింగ్ షెకావత్. "21 ఏళ్లకే అమరుడైన పరమవీర చక్ర, 'సెకండ్ లెఫ్టినెంట్ కర్నల్' అరుణ్ ఖేత్రపాల్​ను చూసి గర్వపడతామే తప్ప.. టూల్​కిట్ ప్రచారకులను కాదు" అని వ్యాఖ్యానించారు.

విపక్షాలపై ప్రశ్నల వర్షం కురిపించారు భాజపా ప్రధాన కార్యదర్శి సంతోష్. ఓ నేరాన్ని కప్పిపుచ్చేందుకు విపక్షాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. 21 ఏళ్ల యువతికి టూల్​కిట్ ఎడిట్ చేసే అవకాశం ఎలా వచ్చిందని ప్రశ్నించారు.

"21 ఏళ్లు, పర్యావరణ కార్యకర్త, విద్యార్థి... దేశాన్ని విభజించే శక్తులతో కలిసేందుకు కావాల్సినవి ఇవేనా? టూల్​కిట్​ను ఎడిట్ చేసేందుకు ఆమెకు అనుమతులు ఎలా వచ్చాయి? దేశ వ్యతిరేక వాట్సాప్ గ్రూపుల్లో ఆమె ఎందుకు ఉంది? ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. కానీ సమాధానం మాత్రం ఒక్కటే.. 21 ఏళ్లు."

-బీఎల్ సంతోష్, భాజపా ప్రధాన కార్యదర్శి

జాతీయవాదానికి వ్యతిరేకంగా మొలకెత్తే విత్తనాలను కూకటివేళ్లతో పెకిలించివేయాలని హరియాణా హోంమంత్రి అనిల్ విజ్ అన్నారు. అది దిశా రవి అయినా, ఇంకెవరైనా చేయాల్సింది ఇదేనని చెప్పారు.

విడుదల చేయండి

దిశా రవిని విడుదల చేయాలని సామాజిక, పర్యావరణ కార్యకర్తలు డిమాండ్ చేశారు. దిశపై మోపిన కేసులను వెనక్కి తీసుకోవాలని స్పష్టం చేశారు. అరెస్టయిన దిశ, జాకబ్, శంతనుకు మద్దతుగా ప్రదర్శనలు నిర్వహించారు.

"దిశా రవిని వెంటనే విడుదల చేయాలి. అలాంటి వారిని పోలీసులు వేధించడం ఆపాలి. రవి వంటి వారు తమ గురించి మాత్రమే కాక భవిష్యత్ తరాల గురించి ఆలోచించే వ్యక్తులు. దేశానికి ఆశాజ్యోతి లాంటి వారు. నిరసనలను కుట్రలతో సమానంగా పరిగణిస్తే.. అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. టూల్​కిట్ దేశద్రోహం, కుట్ర కాదు. టూల్​కిట్ కేవలం నిరసనల కోసమే."

-కవితా కృష్ణన్, అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం

దిశను ఏ ప్రాతిపాదికన అరెస్టు చేశారని కార్యకర్త షబానాం హష్మి ప్రశ్నించారు. స్థానికంగా ప్రచారాలు నిర్వహించే వారు కూడా టూల్​కిట్లు తయారు చేసుకుంటారని చెప్పారు. ఈ చర్యల వల్ల అంతర్జాతీయంగా మనం నవ్వుల పాలవుతున్నామని అన్నారు.

దిల్లీ కేంద్రంగా పనిచేసే సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్​మెంట్ సారథి సునీతా నారాయణ్ సహా పలువురు కార్యకర్తలు దిశా రవికి అండగా నిలిచారు.

ప్రభుత్వం ఈ విషయంపై ఎక్కువగా స్పందిస్తోందని, దిశా రవి అరెస్టు చట్టవిరుద్ధమని 50 మందికి పైగా కళాకారులు, కార్యకర్తలు, విద్యావేత్తలు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. నిరుద్యోగం, ఇంధన ధరలు, నిత్యవసర ధరల పెరుగుదల వంటి సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే వీటిని చేపట్టారని ఆరోపించారు. అరెస్టైన పర్యావరణ కార్యకర్తలను విడుదల చేయాలని ఆన్​లైన్ పిటిషన్​ను మొదలుపెట్టారు.

టూల్​కిట్ కేసు ఇదే

టూల్ కిట్ వ్యవహారంలో బెంగళూరుకు చెందిన 21 ఏళ్ల దిశ రవిని దిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం శనివారం అరెస్టు చేసింది. ఆమెకు కోర్టు 5 రోజుల కస్టడీ విధించింది. టూల్​కిట్​ వల్లే జనవరి 26న రైతుల ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా మారిందన్నది పోలీసుల వాదన.

ఏంటా టూల్​కిట్?

రైతుల ఉద్యమానికి అండగా నిలబడాలని అనుకునేవారికి కార్యాచరణ ప్రణాళికే టూల్ కిట్. రైతులకు మద్దతుగా ట్విట్టర్​లో పోస్టులు, ప్రజా ప్రతినిధులకు వినతులు, ఆర్థిక సహాయం, అంబానీ, అదానీ సంస్థల ఉత్పత్తుల బహిష్కరణ, క్షేత్రస్థాయిలో(ప్రభుత్వ కార్యాలయాలు, భారత రాయబార కార్యాలయాలు, మీడియా సంస్థల) వద్ద నిరసన వంటివి చేయాలని పిలుపునిచ్చారు. దాంతో పాటే మరిన్ని వివరాల కోసం కొన్ని లింకులను పొందుపరిచారు.

సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో 3 నెలలుగా అన్నదాతలకు మద్దతుగా నిలిచిన గ్రెటా థన్​బర్గ్... ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు​ ట్విట్టర్​లో ఓ టూల్​ కిట్​ను పోస్టు చేశారు. దేశంలో నిరసనలకు ఆజ్యం పోసేందుకే వీటిని షేర్ చేస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. భారత్​కు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారనేందుకు ఇదే సాక్ష్యమని చెబుతున్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details