Grapes Cultivation In Karnataka :కర్ణాటకలోని బెలగావికి చెందిన ఓ రైతు అరుదైన ద్రాక్షను పండించి రూ.లక్షల్లో ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. తినడానికి మెత్తగా ఉండడం వల్ల ఈ ద్రాక్షకు దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ విపరీతమైన డిమాండ్ ఉంది. వీఎస్డీ అనే ద్రాక్ష జాతిని పండించి భారీగా దిగుబడి పొందుతున్నాడు బాసరగి గ్రామానికి చెందిన సచిన్ శివప్ప అనే రైతు.
సాధారణంగా ద్రాక్ష అంటే ఒక అంగుళం పరిమాణంలో ఉంటుంది. అయితే సచిన్ శివప్ప పండించిన వీఎస్డీ రకం ద్రాక్ష మాత్రం మూడు అంగుళాల పొడవు ఉంటుంది. ఈ వీఎస్డీ ద్రాక్ష జాతిని చూసేందుకు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి రైతులు సచిన్ వ్యవసాయ క్షేత్రానికి భారీగా తరలివస్తున్నారు. వీఎస్డీ ద్రాక్ష చెట్లు పొడవాటి తీగలతో ఉండడం చూపరులను మరింత ఆకట్టుకుంటున్నాయి.
ద్రాక్ష తోటలో రైతు సచిన్ శివప్ప
"మహారాష్ట్రకు చెందిన ఒక రైతు తన ఫామ్లో ఉన్న ద్రాక్ష చెట్టుకు కాసిన ఒక అరుదైన పండును గుర్తించాడు. ఆ అరుదైన పండును పరిశోధించి రెండుమూడేళ్లు ఆ ద్రాక్ష జాతిని పండించాడు. లాభాలు ఉన్నాయని తెలిశాక మిగతా రైతులకు అరుదైన ద్రాక్ష జాతి గురించి వివరించి పంట వేసుకోవడానికి రైతులకు సాయం చేశాడు. మేము పండించిన ద్రాక్ష మలేసియా, ఆస్ట్రేలియా, దుబాయ్, ముంబయి, ఇతర ప్రదేశాలకు ఎగుమతి చేస్తున్నాం. ప్రస్తుతం కిలో ద్రాక్ష ధర రూ.50 నుంచి రూ.80 దాకా పలుకుతోంది. "
--సచిన్ శివప్ప, రైతు
కొన్నాళ్ల క్రితం వరకు సంప్రదాయ పద్ధతిలో ద్రాక్ష సాగు చేశానని చెప్పాడు రైతు సచిన్ శివప్ప. మహారాష్ట్రకు చెందిన ఓ రైతు దగ్గర నుంచి వీఎస్డీ రకం ద్రాక్ష విత్తనాలను తెచ్చి వాటిని అభివృద్ధి చేసి మొదట రెండు ఎకరాల్లో సాగుచేశానని అన్నాడు. ఇప్పుడు మంచి దిగుబడి రావడం వల్ల 10 ఎకరాల్లో వీఎస్డీ రకం ద్రాక్షను పండించి మంచి ఆదాయాన్ని పొందుతున్నానని తెలిపాడు. ఈ జాతి ద్రాక్షను పండించడానికి ఖర్చు తక్కువ అవుతుందని చెప్పాడు. వీఎస్డీ రకం ద్రాక్షకు తెగుళ్లు కూడా అంతగా రావని ఇది రైతులకు వరమని శివప్ప పేర్కొన్నాడు.
ఎకరాకు 20 టన్నుల ద్రాక్ష దిగుబడి వస్తుందని చెప్పాడు సచిన్. తాము తొమ్మిది మంది సోదరులమని అందరం కలిసి వ్యవసాయం చేస్తామని తెలిపాడు. వీఎస్డీ ద్రాక్షను కొనేందుకు దళారుల తమ వద్దకు వస్తారని పేర్కొన్నాడు. గతేడాది 4 అంగుళాల పొడవైన ద్రాక్ష పండిందని ఈ ఏడాది వాతావరణ పరిస్థితుల దృష్ట్యా 3 అంగుళాల పొడవు మాత్రమే పెరిగిందని చెప్పాడు. మొత్తం తనకు 70 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని సచిన్ శివప్ప తెలిపాడు.