ఆస్తి కోసం అమ్మమ్మను ఇంట్లో నుంచి గెంటేశాడు ఓ మనమడు. ఈ హృదయవిదారక ఘటన కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో జరిగింది. అయితే ఈ విషయం రెవెన్యూ ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. దీంతో వృద్ధురాలికి చట్టప్రకారం తన ఇల్లును తిరిగి అప్పగించారు అధికారులు.
ఇదీ జరిగింది..
జిల్లాలోని కొరటగెరె పట్టణంలో కావలమ్మ(80) అనే వృద్ధురాలు నివసిస్తోంది. ఆమె కుమార్తె లక్ష్మమ్మ 8 నెలల క్రితం క్యాన్సర్‌తో మరణించింది. అప్పటి నుంచి లక్ష్మమ్మ కుమారుడు మారుతి, అతడి భార్య, పిల్లలు.. కావలమ్మ ఇంట్లోనే ఉంటున్నారు. తల్లి మరణానంతరం మారుతి.. తన అమ్మమ్మ ఇంటిని కాజేయాలని ప్లాన్ చేశాడు. అప్పుడు కావలమ్మను ఇంటి నుంచి గెంటేశాడు. మనమడు ఇంటి నుంచి గెంటేయడం వల్ల కావలమ్మ బంధువుల ఇంట్లో కొన్నాళ్లు ఉంది. వారి సహాయంతో మనమడు మారుతిపై సిటిజన్స్ హక్కుల చట్టం కింద కేసు పెట్టింది.
ఈ కేసును అసిస్టెంట్ కమిషనర్ రిషీ ఆనంద్ సీరియస్‌గా తీసుకున్నారు. వృద్ధురాలి ఇల్లును ఖాళీ చేయాలని మారుతికి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఆదేశాల మేరకు మారుతి.. కావలమ్మ ఇంటిని ఖాళీ చేశాడు. దీంతో తహసీల్దార్, పోలీసుల సమక్షంలో వృద్ధురాలు కావలమ్మ తన ఇంట్లోకి వెళ్లింది.
వృద్ధురాలికి తన ఇంటిని అప్పజెప్పుతున్న అధికారులు కొవిడ్‌కు ముందు మారుతి బెంగళూరులో ఉద్యోగం చేసేవాడు. కరోనా సంక్షోభం వల్ల ఉద్యోగం కోల్పోయాడు. అప్పటి నుంచి తల్లి లక్ష్మమ్మ, అమ్మమ్మ కావలమ్మతో కలిసి ఉండేవాడు. ఉద్యోగం లేకపోవడం వల్ల ఆర్థికంగా ఇబ్బందిపడేవాడు. అయితే అమ్మమ్మ, తల్లికి వచ్చే పింఛన్‌తో తన ఖర్చులు తీర్చుకునేవాడు. మారుతి దీనస్థితిని చూసి వారూ ఏమనేవారుకాదు. ఏదైనా పనిచేసుకోమని బంధువులు సలహా ఇచ్చినా మారుతి పట్టించుకునేవాడు కాదు. తల్లి మరణం తర్వాత అమ్మమ్మ ఇల్లు అమ్మేయ్యాలని మారుతి నిర్ణయించుకున్నాడు. అందుకే కావలమ్మను ఇంటి నుంచి బయటకు గెంటేశాడు.