కర్ణాటకలోని బెళగావి జిల్లాలో శంకేశ్వర పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతం వల్ల ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన శనివారం జరిగింది. మృతులు అదే ప్రాంతానికి చెందిన శాంతవ్వ బస్తవాడే, సిద్ధార్థ బస్తవాడేలుగా పోలీసులు గుర్తించారు.
బామ్మను కాపాడబోయి..
వర్షం మొదలవడం వల్ల ఇంటి వెనుక ఉన్న ఇనుప తీగపై ఆరేసిన బట్టలు తెచ్చేందుకు శాంతవ్వ వెళ్లింది. ఆ తీగకు అక్కడే ఓ స్తంభానికి ఉన్న కరెంట్ వైర్ తాకుతోంది. ఇది గమనించని శాంతవ్వ బట్టలు తీసేందుకు ఆ తీగపైన చేయి వేయగా విద్యుదాఘాతానికి గురైంది. అక్కడే ఉన్న ఆమె మనవడు సిద్ధార్థ.. శాంతవ్వను రక్షించేందుకు వెళ్లగా.. అతడికీ షాక్ కొట్టింది. శాంతవ్వ, సిద్ధార్థ అక్కడికక్కడే మృతిచెందారు. వీరిని కాపాడేందుకు వెళ్లిన శాంతవ్వ కోడలి పరిస్థితి విషమంగా ఉంది. ఆమె ప్రస్తుతం స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి :గంగా నదిలో వదిలితే.. పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా?