Grand Welcome to Chandrababu in Hyderabad : చంద్రబాబుకు హైదరాబాద్‌లో అపూర్వ స్వాగతం లభించింది. మంగళవారం రాజమండ్రిలో జనసందోహం పోటెత్తగా.. ఇవాళ బేగంపేట విమానాశ్రయాన్ని అభిమాన సంద్రం ముంచెత్తింది. భారీగా తరలివచ్చిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, ఐటీ ఉద్యోగులు, వేలాది మంది అభిమానులు.. ఆయనకు పూల వర్షం కురిపిస్తూ అద్భుత స్వాగతం పలికారు. అసంఖ్యాకంగా విమానాశ్రయానికి చేరుకున్న అభిమానగణం.. జై బాబు.. జైజై చంద్రబాబు అంటూ నినాదాలతో హోరెత్తించారు. నిజమైన లీడర్, లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన విజనరీ అంటూ.. విమానాశ్రయ ప్రాంతం దద్దరిల్లేలా నినాదాలు చేశారు. ఆయన వల్లే ఉన్నతస్థానాల్లో ఉన్నామని, ఊహించనంత అత్యుత్తమ జీవితాలను గడుపుతున్నామని గుర్తుచేసుకున్నారు.
నాయకుడంటే రాజకీయాలు చేయడం మాత్రమే కాదు.. సమాజ పురోభివృద్ధికి, ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు పాటుపడిన వారే అసలు సిసలు నాయకుడనే విషయాన్ని.. చంద్రబాబు చాటి చెప్పారని ప్లకార్డులు ప్రదర్శించారు. "వుయ్ ఆర్ విత్ చంద్రబాబు", "మేము సైతం బాబు కోసం", "సైకో పోవాలి..సైకిల్ రావాలి" అంటూ ఐటీ ఉద్యోగులు గర్జన చేశారు. మళ్లీ చంద్రబాబు పాలన వస్తేనే నవ్యాంధ్ర బాగుపడుతుందని ఆకాంక్షించారు. తెలుగుదేశం జెండాలు, చంద్రబాబు ఫ్లెక్సీలు చేతబట్టుకుని.. మీకు తోడుగా మేమున్నామంటూ అభిమాననేతకు సంఘీభావం తెలిపారు.
TDP Chief Chandrababu Naidu Comments: 'నేను ఏ తప్పూ చేయలేదు.. ప్రజల అభిమానం ఎప్పటికీ మర్చిపోలేను'
TDP Chief Chandrababu Arrived Hyderabad :వెల్లువెత్తిన అభిమాన సంద్రాన్ని దాటుకుని ముందుకు సాగడం.. చంద్రబాబుకు కష్టతరమైంది. అభిమానులను పక్కుకు పంపించి.. చంద్రబాబు వాహనశ్రేణిని ముందుకు పంపడం పోలీసులకు సాధ్యపడలేదు. ఎయిర్ పోర్టు లోపలి నుంచి చంద్రబాబు వాహనశ్రేణి.. ప్రధాన రహదారిపైకి రావడానికే గంటకు పైగా సమయం పట్టింది. వేలాది మంది యువకులు.. బైకులపై చంద్రబాబు వాహనశ్రేణిని అనుసరిస్తూ, హారన్ మోగిస్తూ కాన్వాయ్ వెంట వెళ్లారు. ప్రధాన రహదారిపైకి వచ్చాక కూడా అదే పరిస్థితి నెలకొంది. పోటెత్తిన అభిమానుల మధ్య కాన్వాయ్ ముందుకు సాగింది. కోర్టు నిబంధనల మేరకు కారు లోపలే ఉన్న చంద్రబాబు.. తెలుగుదేశం నాయకులు, అభిమానులకు అభివాదం చేస్తూ జూబ్లీహిల్స్‌లోని నివాసానికి చేరుకున్నారు.