అయోధ్యలో రామాలయం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రాజస్థాన్‌లోని బన్సీ పహాడ్పుర్లోని గులాబీ రాయిని(పింక్ స్టోన్) రామ్‌లల్లా ఆలయ నిర్మాణంలో ఉపయోగిస్తున్నారు. గర్భగుడిలో మొత్తం 14 తలుపులు ఉంటాయి. ఆలయ నిర్మాణంలో నిమగ్నమైన సిబ్బంది, ఇంజినీర్లు రాంలల్లా ఆలయానికి తలుపులను ఏ కలపతో తయారు చేయాలనే అంశంపై పరిశోధనలు చేస్తున్నారు. పొరుగున ఉన్న గోండా జిల్లాలోని బహ్రాయిచ్, షీషమ్-సఖు, మనకాపుర్ అడవుల నుండి దీనిని తెప్పించనున్నారు. ఈ ఆలయ నిర్మాణంలో ముస్లిం కళాకారులు సైతం భాగమయ్యారు. తలుపులను అమర్చేందుకు.. వీరు తెల్లటి రంగు మక్రానా పాలరాయి ఫ్రేమ్‌లను తయారు చేస్తున్నారు.
90వ దశకం నుంచి రామ మందిర ఉద్యమం జరుగుతున్న సమయంలో ఆలయ నిర్మాణం కోసం రాజస్థాన్‌లోని బన్సీ పహాడ్పుర్లోని గులాబీ రాళ్లను(పింక్ స్టోన్) చెక్కి ఉంచారు. 'ఆలయ నిర్మాణాన్ని 2024 జనవరి నాటికి పూర్తి చేస్తాం. ఆలయ వైభవాన్ని కాపాడేందుకు రామజన్మ తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఎల్లవేళలా కృషిచేస్తోంది. ఎటువంటి విపత్తులు వచ్చినా ఆలయం సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతో నిర్మాణానికి నాణ్యమైన సామాగ్రినే వాడుతున్నాం. ఆలయం నిర్మాణం కోసం ఇంజినీర్లు, శాస్త్రవేత్తల సలహాలు తీసుకున్నాం' అని హిందూ పరిషత్ ప్రతినిధి శరద్ శర్మ తెలిపారు.