ఐదేళ్ల క్రితం బెంగళూరులో సంచలనం రేపిన మహిళ కేసులో నగర పోలీసులు ఎట్టకేలకు కీలక పురోగతి సాధించారు. ప్రధాన నిందితులు ఇద్దరిని మహారాష్ట కొల్హాపుర్లో అరెస్టు చేసి, బెంగళూరుకు తీసుకొచ్చారు. నిందితులు సంజయ్(26), శశికళ(46).. తల్లీకొడుకులు. మృతురాలు శాంత కుమారి.. ఆ యువకుడికి అమ్మమ్మ. ఆవేశంలో ఆమెను చంపేసిన సంజయ్.. తల్లి శశికళ సాయంతో మృతదేహాన్ని దాచిపెట్టాడు. చివరకు ఇన్నేళ్ల తర్వాత పోలీసులకు చిక్కాడు.
మంచూరియా తినలేదని..
పోలీసుల కథనం ప్రకారం.. శశికళ భర్త చాలా ఏళ్ల క్రితం మరణించారు. కుమారుడు సంజయ్, తల్లి శాంత కుమారితో కలిసి బెంగళూరులోని కెంగేరి సాటిలైట్ కాలనీలో ఓ ఇంట్లో అద్దెకు ఉండేది శశికళ. సంజయ్.. చదువులో బాగా రాణించేవాడు. పదో తరగతి, ఇంటర్లో 90శాతానికిపైగా మార్కులు సాధించాడు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కోర్స్లో చేరాడు.
2016 ఆగస్టులో ఒక రోజు.. కాలేజీ నుంచి ఇంటికి తిరిగొస్తూ.. అమ్మమ్మ కోసం గోబీ మంచూరియా తెచ్చాడు సంజయ్. అయితే.. 69 ఏళ్ల శాంత కుమారి.. మంచూరియా తినేందుకు నిరాకరించింది. మనుమడిపైకి విసిరికొట్టింది. కోపోద్రిక్తుడైన సంజయ్.. వంట గదిలో దొరికిన ఓ వస్తువుతో ఆమె తలపై బలంగా కొట్టాడు. ఫలితంగా శాంత కుమారి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
అప్పటి వరకు ఏదో పనిలో ఉన్న శశికళ.. కుమారుడి చేసిన పని గురించి తెలుసుకుని నిర్ఘాంతపోయింది. పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు సిద్ధమైంది. అయితే.. అలా చేయొద్దని సంజయ్ తన తల్లిని బతిమాలాడు. ఫలితంగా ఆమె ఈ విషయాన్ని రహస్యంగా ఉంచింది. మృతదేహాన్ని ఎలాగైనా మాయం చేయాలని అనుకున్నారు ఆ తల్లీకొడుకులు. సంజయ్ తన మిత్రుడైన నందీశ్ సాయం కోరాడు.