రాముడి జన్మస్థలం అయోధ్యలో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం అట్టహాసంగా నిర్వహించిన మహా దీపోత్సవంతో అయోధ్య దివ్వెల వెలుగుల్లో సరికొత్తగా కాంతులీనింది. 5లక్షల 51వేల దీపాలతో ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు అధికారులు. ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన దేవతా రూపాలు
మహా దీపోత్సవంతో యావత్ అయోధ్యపురి పులకించిపోయింది. సరయూ తీరం వెంబడి కనుచూపమేర కొలువుతీరిన 5లక్షల 51వేల దీపాలతో అయోధ్య నగరం కాంతులీనింది. ఎటు చూసినా వెలుగులే అన్నట్లు సాగిన ఈ దీపోత్సవం.. రామ జన్మస్థలానికి కొత్త శోభను తీసుకువచ్చింది. వేడుకల్లో భాగంగా దీపాలతో తీర్చిదిద్దిన వివిధ దేవతా మూర్తుల రూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.