తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశ్​ముఖ్​కు సుప్రీంలో షాక్- పిటిషన్ కొట్టివేత - అనిల్ దేశ్​ముఖ్ సీబీఐ విచారణ

సీబీఐ విచారణను సవాలు చేస్తూ మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్​ముఖ్ దాఖలు చేసిన పిటిషన్​ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దేశ్​ముఖ్​పై వచ్చిన ఆరోపణల స్వభావాన్ని బట్టి.. ఆయనపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. సీనియర్ మంత్రులపై.. ఉన్నతాధికారులు తీవ్రమైన ఆరోపణలు చేసినప్పుడు వాటిపై విచారణ చేపట్టడంలో తప్పులేదని స్పష్టం చేసింది.

anil deshmukh
సుప్రీంకోర్టు అనిల్ దేశ్​ముఖ్

By

Published : Apr 8, 2021, 4:28 PM IST

Updated : Apr 8, 2021, 4:48 PM IST

మహారాష్ట్ర మాజీ హోంమంత్రి, ఎన్​సీపీ నేత అనిల్ దేశ్​ముఖ్​కు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. బాంబే హైకోర్టు.. సీబీఐ విచారణకు ఆదేశించడాన్ని సవాల్ చేస్తూ దేశ్​ముఖ్ సహా మహారాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన రెండు పిటిషన్ల​ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

దేశ్​ముఖ్​పై వచ్చిన ఆరోపణలపై స్వతంత్ర సంస్థ ద్వారా దర్యాప్తు చేయించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఆరోపణల స్వభావం, ఈ విషయంలో ప్రమేయం ఉన్న వ్యక్తులను బట్టి.. దీనిపై విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

తన వాదనలు వినకుండానే సీబీఐ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశం ఇచ్చిందని సుప్రీంకోర్టుకు వివరించారు దేశ్​ముఖ్. ఎలాంటి ఆధారాలు లేకుండానే తనపై ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. అయితే, దేశ్​ముఖ్ వాదనలను సుప్రీం తోసిపుచ్చింది. ఇది ప్రాథమిక దర్యాప్తు మాత్రమేనని పేర్కొంది. సీనియర్ మంత్రులపై సీనియర్ అధికారులు తీవ్రమైన ఆరోపణలు చేసినప్పుడు విచారణ చేయడంలో తప్పులేదని స్పష్టం చేసింది.

"కేసులో ప్రమేయం ఉన్న వ్యక్తులు, ఆరోపణల తీవ్రతను పరిగణనలోకి తీసుకుంటే.. స్వతంత్ర సంస్థ దర్యాప్తు అవసరమే. ఇది ప్రజల విశ్వాసానికి సంబంధించిన విషయం. సీబీఐ దర్యాప్తు చేయాలన్న హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవాలని అనుకోవడం లేదు. ఇది ప్రాథమిక దర్యాప్తు మాత్రమే. సీనియర్ అధికారులు చేసిన ఆరోపణలపై విచారణ చేయడంలో తప్పులేదు. కేసుకు సంబంధించిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు.. పోలీస్ కమిషనర్, మరొకరు హోంమంత్రి. వీరిద్దరూ కలిసి పని చేసేవారే."

-సుప్రీంకోర్టు

ఇదీ నేపథ్యం

బార్లు, రెస్టారెంట్ల నుంచి ప్రతి నెల రూ.100కోట్లు వసూలు చేయాలని దేశ్‌ముఖ్‌ పోలీసు అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు ముంబయి మాజీ సీపీ పరంవీర్‌ సింగ్‌ ఆరోపించారు. ఈ ఆరోపణలపై ప్రాథమిక విచారణ జరపాలని ఇటీవల సీబీఐని బాంబే హైకోర్టు ఆదేశించింది. విచారణ జరిపేందుకు 15 రోజుల గడువును విధించింది. ఈ కేసుపై మహారాష్ట్ర సర్కారు, అనిల్‌ దేశ్‌ముఖ్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఇదీ చదవండి:అనిల్ దేశ్​ముఖ్​పై సీబీఐ విచారణ ప్రారంభం

Last Updated : Apr 8, 2021, 4:48 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details