భారత ప్రభుత్వ మొత్తం అప్పులు ఈ ఏడాది మార్చి చివరి నాటికి రూ. 116.21 లక్షల కోట్లకు చేరాయి. 2020 డిసెంబర్ నాటికి రూ. 1,09,26,322 కోట్లుగా ఉన్న అప్పులు కేవలం మూడు నెలల్లోనే రూ. 6,95,459 కోట్ల (6.3%) మేర పెరిగాయి. ఇందులో అంతర్గత అప్పులు రూ. 95,83,366 కోట్లు కాగా, విదేశీ రుణాలు రూ. 6,55,941 కోట్ల మేర ఉన్నాయి. పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ మరో రూ.13,82,473 కోట్లు. గత డిసెంబర్ వరకు రూ.9,68,404 కోట్ల మేర ఉన్న పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ మూడు నెలల్లో 42.76% మేర పెరిగాయి.
మూడు నెలల్లో 6.3% పెరిగిన కేంద్రం అప్పులు - ప్రభుత్వ లయబిలిటీస్
కేంద్ర ప్రభుత్వం అప్పులు అంతకంతకూ పెరగుతూ వస్తున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించిన తాజా వివరాల ప్రకారం ఈ ఏడాది మార్చి నాటికి రూ.116.21 లక్షల కోట్లకు చేరాయి. గడిచిన మూడు నెలల్లో 6.3 శాతం మేర పెరిగాయి.
ప్రభుత్వం చెల్లిస్తున్న అప్పులపై సగటు వడ్డీ రేటు 2010-11లో 7.92% మేర ఉండగా, 2020-21 నాటికి అది 5.79%కి తగ్గింది. పదేళ్ల క్రితం అప్పు చెల్లించాల్సిన సగటు కాల పరిమితి 11.62 ఏళ్లు కాగా, ఇప్పుడు అది 14.49 ఏళ్లకు పెరిగింది. వచ్చే 1-5 ఏళ్ల వ్యవధిలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్న అప్పుల్లో 25.64% చెల్లించాల్సి ఉంటుంది. 5-10 ఏళ్లలో 28.98%, 10-20 ఏళ్లలో 19.17% రుణాలను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఆదాయం బడ్జెట్ అంచనాల కంటే 4.9% పెరిగినట్లు తాజా లెక్కలు వెల్లడించాయి. పన్ను ఆదాయం అంచనా కంటే 5.59% పెరగ్గా, పన్నేతర ఆదాయం తగ్గింది. కేంద్ర ఆర్థిక శాఖ శుక్రవారం ఈ మేరకు అధికారికంగా వివరాలను వెల్లడించింది.
ఇదీ చూడండి:కేంద్ర ఐటీ మంత్రికే ట్విట్టర్ ఝలక్